calender_icon.png 17 October, 2024 | 4:01 AM

యాదాద్రి లడ్డూ స్వచ్ఛనది

17-10-2024 02:00:40 AM

ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ

ఊపిరి పీల్చుకున్న దేవాదాయశాఖ

యాదాద్రిభువనగిరి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో భక్తులకు అందజేస్తున్న లడ్డూ ప్రసాదం నాణ్యమైనదేనని తాజాగా స్టేట్ ఫుడ్ లేబోరేటరీ సంస్థ ప్రకటించింది. దీంతో దేవాదాయశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛమైనదని తేల్చిచెప్పింది. నెయ్యిలో తేమ, ఓలాయిక్ యాసిడ్ వంటి కొవ్వు పదార్థాలు  ఉండాల్సిన  మోతాదుల్లోనే ఉన్నాయని పేర్కొన్నది. తిరుమల లడ్డూ కల్తీ వివాదం బయటకు వచ్చిన తర్వాత, యాదాద్రి పరిధిలో భక్తులకు పంపిణీ చేస్తున్న లడ్డూ ప్రసాదం నాణ్యతపైనా అనుమానాలు తలెత్తాయి.

దీంతో రాష్ట్ర దేవాదాయశాఖ వెంటనే అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే యాద్రాద్రి ఆలయ పరిధిలో లడ్డూ తయారీకి వినియోగిస్తున్న నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరస్పర సహకార సహాయక యూనియన్ (మదర్ డెయిరీ) సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలు సేకరించింది.

వాటిని సెప్టెంబర్ 21న స్టేట్ ఫుడ్ లేబోరేటరీకి చేరవేసింది. ల్యాబ్ నిపుణులు లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి స్వచ్ఛమైనదని తాజాగా తేల్చింది. మదర్ డెయిరీ టెండర్ ప్రక్రియ ద్వారా నాలుగు దశాబ్దాలుగా ఆలయానికి నెయ్యి సరఫరా చేస్తున్నది. భక్తుల తాకిడిని బట్టి లడ్డూ తయారీకి ప్రతి నెలా సుమారు 20 వేల కిలోల నుంచి 22 వేల కిలోల వరకు అవసరమవుతుంది. కిలో నెయ్యికి డెయిరీ ప్రస్తుతం రూ.619 చార్జ్ చేస్తున్నది. ఈ టెండర్ ఒప్పందం మార్చి 2025 వరకు ఉన్నది. 

ఆలయాలకు విజయ డెయిరీ నెయ్యి

సాధారణంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల పరిధిలో తయారు చేసే ప్రసాదాలకు ప్రభుత్వ రంగ డెయిరీ అయిన విజయ డెయిరీ నెయ్యి వినియోగించాల్సి ఉన్నది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాలు సైతం ఉన్నాయి. యాదాద్రి ఆలయ పరిధిలో మదర్‌డెయిరీతో మార్చి 2025 వరకు ఒప్పందం ఉన్నందున ఆ ఉత్తర్వులు అక్కడ అమలు కావడం లేదు.

ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి ఆలయానికి మదర్ డెయిరీ నుంచే నెయ్యి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుని, పాడి రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి తోడు ప్రస్తుతం ఆ డెయిరీ నెయ్యి నాణ్యతా పరీక్షల్లోనూ నెగ్గడంతో మార్చి తర్వాత కూడా మదర్ డెయిరీనే నెయ్యి సరఫరా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి బంగారు తాపడ విమాన గోపుర ఘనత నృసింహుడిదే

రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో తొలి బంగారు తాపడ విమాన గోపురం ఉన్న స్వామిగా యాదాద్రి నృసింహుడు అరుదైన రికార్డును నమోదు చేయనున్నాడు. ఆలయ ప్రస్తుతం విమాన గోపురానికి సంబంధించిన స్వర్ణ తాపడం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే కళాకారులు, సిబ్బంది గోపురానికి సంబంధించిన రాగిరేకుల పనులు పూర్తి చేశారు. తాపడానికి 12 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. నవంబర్ 1న బంగారం కళాకారులకు అందుతుంది. ఫిబ్రవరి 15లోపు  తాపడం పనులు పూర్తి కానున్నాయి. మార్చిలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి గోపురం స్వర్ణ శోభితంగా ధగ ధగలాడనున్నది.

నెయ్యి నాణ్యమైనది

యాదాద్రి ఆలయ ప్రసాదాలకు వినియోగిస్తున్న మదర్ డెయిరీ ఉత్పత్తులు నాణ్యమైన వని స్టేట్ ఫుడ్ లేబోరేటరీ సంస్థ ధ్రువీకరించింది. ఆలయ పరిధిలో ప్రతి రోజు వెయ్యి కిలోల లడ్డూ ప్రసాదం తయారు చేస్తాం. వాటిని భక్తులకు అందిస్తున్నాం. లడ్డూ తయారీలో వినియో గించే నెయ్యి సరఫరాకు టెండర్లు నిర్వహిస్తాం. దీనిలో భాగంగానే మదర్ డెయిరీ నుంచి నాలుగు దశాబ్దాలుగా ఆలయానికి నెయ్యి అందు తున్నది. ఆలయాలకు విజయ డెయిరీ నెయ్యిని వినియోగించాలనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, మదర్ డెయిరీతో ఒప్పందం మార్చి 2025  వరకు ఉన్నందున ఆ డెయిరీనే నెయ్యి సరఫరా చేస్తున్నది.

 ఏ.భాస్కర్ రావు, 

యాదాద్రి ఆలయ ఈవో