calender_icon.png 22 September, 2024 | 8:02 AM

యాదాద్రి ఊసేలేని బడ్జెట్

26-07-2024 12:05:00 AM

అసంపూర్తి పనులు ముందుకు సాగడంపై సందిగ్ధత

యాదాద్రి భువనగిరి, జూలై 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభలో తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధుల మాటే ఎత్తలేదు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అసంపూర్తిగా మిగిలి పోయి న పనులను పూర్తిచేయడానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుందని ఆలయ వర్గాలు ఆశించాయి. అయితే, ఆ ఊసే లేకపోవడంతో నిధుల కొరతతో అర్ధాంతరంగా నిలిచిన పనులు ముందుకు సాగెదెట్లా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిది ద్దేందుకు అప్పటి సీఎం కేసీఆర్ సంకల్పించారు. కొండపై ఆలయంతో పాటు పరిస రాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించి 2016 అక్టోబర్‌లో పనులు ప్రారంభించారు.

ఇందుకోసం సీఎం చైర్మన్‌గా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక ప్రాధికార సంస్థను ఏర్పా టు చేశారు. ఈ సంస్థకు దాదాపు ఏడేళ్ల పాటు క్రమం తప్పకుండా బడ్జెట్‌లో నిధులను కేటాయించి, ఆలయ పునఃనిర్మాణం, పరిసరాల అభివృద్ధి పనులను చేపట్టారు. దాదాపు రూ.1,200 కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి 2022 మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిపి, గర్భాలయంలో భక్తులకు దర్శనాలను పునః ప్రారంభించారు. అయితే, అప్పటికే ఆలయ పరిస రాల్లో, పుష్కరిణీ వద్ద అభివృద్ధి పనులు, రహదారులు, బ్రిడ్జి, గండి చెరువు అభివృద్ధి, వాహనాల పార్కింగ్ తదితర పనులు అసంపూర్తిగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.150 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వా త పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపడుతుందని భావించారు. ఆలయాన్ని సంద ర్శించిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా అదే మాట చెబుతూ వచ్చారు. కానీ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యాదాద్రి ఆలయ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో అసంపూర్తి పనులు ఎలా ముందుకు సాగుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.