calender_icon.png 24 October, 2024 | 5:54 AM

మార్చి నాటికి ‘యాదాద్రి’

12-09-2024 12:42:05 AM

  1. డిసెంబర్‌లోగా 3 యూనిట్లలో విద్యుదుత్పత్తి 
  2. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పనుల్లో ఆలస్యం 
  3. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాక ఖజానాపై భారం

నిర్వాసితులకు పరిహారంతోపాటు ఉద్యోగాలు 

రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులపై మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష

 నల్లగొండ, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): వచ్చే ఏడాది మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)ను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న వైటీపీఎస్ పనుల పురోగతిపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి బుధవారం టీఎస్‌జెన్‌కో, బీహెచ్‌ఈఎల్, ప్లాంట్ ఇంజినీర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. అనంతరం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నాటికి 3 యూనిట్లను, వచ్చే మార్చి నాటికి ఐదు యూనిట్లను పూర్తిచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగానే పవర్ ప్లాంట్ పనులు సకాలంలో పూర్తి కాలేదని ఆక్షేపించారు. 2015లో పనులను ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం 2021 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని చిత్తశుద్ధి లేక విఫలమైందన్నారు. పనుల పురోగతిపై కనీసం సమీక్షలు చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రాజెక్టు సకాలంలో పూర్తికాక రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడిందని పేర్కొన్నారు. 

ఇకపై వారానికి ఒకసారి సమీక్ష..

యాదాద్రి పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇకపై వారానికి ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 50 శాతం విదేశీ, 50 శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుదుత్పత్తి చేస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి సమాచారం ఇచ్చి తరువాత నిర్ణయం మార్చుకోవడంతో పర్యావరణ అనుమతులు రద్దయి ప్రాజెక్టు మొదటికొచ్చిందన్నారు. ఎన్జీటీకి నాటి ప్రభుత్వం సరైన సమాచారం ఇచ్చి ఉంటే పనుల్లో ఆలస్యం జరిగి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీటీ నిబంధనలకు అనుగుణంగా ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని గుర్తు చేశారు.

జూలైలో పర్యావరణ అనుమతులను సైతం తీసురావ డంతో ప్రస్తుతం రెండో యూనిట్‌లో ఆయిల్ సింక్రనైజేషన్ పనులుపూర్తయినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యాక యూనిట్ ధర ఎంతన్నది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) నిర్ణయిస్తుందని చెప్పారు. యూనిట్ ధర రూ.6.35 ఉంటుందని సూత్రపాయంగా తెలిపారు. వైటీపీఎస్ పూర్తయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగడంతోపాటు విద్యుత్ అవసరాలు తీరుతాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చిన వారు త్యాగధనులని, నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారికి పరిహారంతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పవర్ ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. రోడ్లు, రైల్వే, సివిల్ పనులను సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు.

రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ 

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగం గా యూనిట్‌కు సంబంధించిన జనరేటర్‌ను విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)కు అనుసంధానం చేశారు. జనరేటర్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ, ఓల్టేజీ, ఫేజ్ యాంగిల్స్‌తో సరిపోలితే సింక్రనైజేషన్ పూర్తయినట్లు పరిగణిస్తా రు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బం ది, కార్మికులను డిప్యూటీ సీఎం అభినందించారు. కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పాల్గొన్నారు.