గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, జనవరి 26 (విజయ క్రాంతి) ః యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందని కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గణతంత్ర వేడుకలను ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డీసీపీ రాజేష్ చంద్రతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశమంతా ఆనందోత్సాహాలతో గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే పర్వదినమిది అన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలుపుకునేందుకు, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ సారధ్యంలో రాయబడిన భారత రాజ్యాంగం జనవరి 26, 1950 రోజున అమలులోకి వచ్చిందని, ఇలాంటి పర్వదినాన దేశ స్వాతంత్య్రం కోసము పోరాటం సాగించిన అమర వీరులకు, రాజ్యాంగ రూపకర్తలకు జోహారులు అర్పిస్తున్నానన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పధకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు.