14-12-2024 12:00:00 AM
దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి చిక్కుల్లో పడిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చివరికి పదవిని కోల్పోక తప్పలేదు. ఇటీవల మార్షల్ లా ప్రకటించి ఆ తర్వాత ప్రజలతో పాటు అన్నిపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడంతో దాన్ని ఉపసంహరించుకుంటు న్నట్లు యూన్‌సుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు లో ఆధిక్యత ఉన్న ప్రతిపక్షాలు మాత్రం ఆయన పదవినుంచి తప్పుకోవలసిందేనని పట్టుబట్టాయి.
తనకుతానుగా తప్పుకోకపోతే అభిశంసన తీర్మానం తీసుకువస్తామని కూడా ప్రకటించాయి. అయితే కేవలం క్షమాపణ చెప్పిన యూన్‌సుక్ పదవినుంచి తప్పుకోవడానికి మాత్రం అంగీక రించలేదు. దీంతో ప్రతిపక్షాలు పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. శనివారం జరిగిన ఓటింగ్‌లో 300 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో 204 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయ గా, 85 మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇటీవల ఆయనపై ఒకసారి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అప్పట్లో అధికార పీపుల్ పవర్ పార్టీకి చెందిన సభ్యులు బాయ్‌కాట్ చేశారు. దీంతో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. కానీ శనివారం మరోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా భారీ మెజారిటీతో దానికి ఆమోదం లభించింది. దీంతో ఆయన పదవి ఊడడం ఖాయమైంది.అధ్యక్షుడిగా యూన్‌సుక్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆయన అధికారాలకు కూడా కత్తెర వేశారు. అభిశంసన తీర్మానం ఓటింగ్ సందర్భంగా పార్లమెం టు ముందు పెద్ద సంఖ్యలో చేరిన జనం తీర్మానం ఆమోదం పొందిందని తెలియగానే సంతోషంతో కేరింతలు కొట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి లభించిన పెద్ద విజయమని ప్రధాన ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించడం గమనార్హం. అధికార పార్టీ నేత కూడా పార్లమెంటు నిర్ణయాన్ని అంగీకరి స్తున్నట్లు ప్రకటించారు.
పార్లమెంటు ఆమోదించిన అభిశంసన తీర్మానా న్ని ఇక రాజ్యాంగ న్యాయస్థానానికి పంపిస్తారు. దీన్ని పరిశీలించిన రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవలసి ఉం టుంది. అదే సమయంలో ఆయనను అధ్యక్షుడిగా కొనసాగించాలా వద్దా అనేది కూడా న్యాయస్థానం పరిధిలోనే ఉంటుంది. ఒకవేళ అధ్యక్ష పదవినుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు దేశ పాలనా బాధ్యతలను ప్రధానిగా ఉన్న హాన్‌డాంగ్ హూన్ చూస్తారు. కాగా రాజ్యాంగ న్యాయస్థానం కూడా ఏడుగురు జడ్జిలతో కూడిన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం న్యాయస్థానంలో ఆరుగురు జడ్జిలే ఉన్నారు. మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించుకోవాలి. అలా కాని పక్షంలో ఆరుగురు జడ్జిలు ఏకపక్ష నిర్ణయాన్ని ప్రకటిస్తే కూడా చెల్లుబాటు అవుతుందని అంటున్నారు. మరోవైపు రాజ్యాంగ న్యాయస్థానం సోమవారం సమావేశమై బహిరంగ విచారణ తేదీని నిర్ణయించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ విచారణకు యూన్‌సుక్ వ్యక్తిగతంగా హాజరవుతారా లేదా అనేది కూడా స్పష్టం కాలేదు.
ఒక వేళ యూన్‌సుక్ గద్దె దిగితే దక్షిణ కొరి యా చరిత్రలో అభిశంసన ద్వారా పదవి కోల్పోయిన రెండో అధ్యక్షుడవుతారు. వాస్తవానికి 2022లో యూన్‌సుక్ అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటి నుంచీ చిక్కులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్నికల్లో సైతం ఆయనకు చాలా తక్కువ మెజారిటీ వచ్చింది. మరోవైపు ఆయనతో పాటుగా సతీమణి కిమ్‌పైనా పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో కొద్దికాలం లోనే ఆయన ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ చిక్కులనుంచి బైటపడడం కోసమే ఆయన ఇటీవల అనూహ్యంగా మార్షల్ లా ప్రకటించాల్సి వచ్చింది. అయితే దానికి పెద్ద ఎత్తున నిరసన లు వ్యక్తం కావడంతో కొద్ది గంటల్లోనే నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. అయినా పదవీ గండం మాత్రం తప్పలేదు. ఇదిలా ఉండగా ఆసియాలో బలమైన మిత్రదేశమైయిన దక్షిణ కొరియాతో తమ సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయని అమెరికా ప్రకటించడం కొసమెరుపు.