calender_icon.png 22 October, 2024 | 11:28 PM

పట్నాకు తప్పని తిప్పలు

22-10-2024 01:05:08 AM

చిత్తయిన ఢిల్లీ

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-11లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్, పునేరి పల్టన్ విజయ ఢంకా మోగించాయి. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ యూపీతో మ్యాచ్‌లో మాత్రం 28-23 తేడాతో ఓడిపోయింది. గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నించినా కానీ యూపీ ముందు ఢిల్లీ పప్పులు ఉడకలేదు.

ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ ఎక్స్‌ప్రెస్ కేవలం 4 పాయింట్లు మాత్రమే చేయడంతో ఢిల్లీ అనుకున్నంత వేగంగా పాయింట్లు సాధించడంలో విఫలం అయింది. గత మ్యాచ్‌లో నవీన్ ఎక్స్‌ప్రెస్ కెప్టెన్సీ చేయగా.. సోమవారం మ్యాచ్‌లో అషూ మాలిక్‌కు కెప్టెన్సీ అప్పజెప్పారు. గత మ్యాచ్‌లో కేవలం 2 పాయింట్లకే పరిమితం అయిన నవీన్ కుమార్, యూపీతో మ్యాచ్‌లో కెప్టెన్సీ ఒత్తిడి లేకున్నా కానీ పెద్దగా రాణించలేదు.

యూ ముంబా మీద సూపర్ టెన్ సాధించిన అషూ మాలిక్ యూపీతో మ్యాచ్‌లో మాత్రం 4 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఇక రెండో మ్యాచ్‌లో పునేరి పల్టన్ చేతిలో 40-25 తేడాతో పట్నా పైరేట్స్ చిత్తయింది. హ్యాట్రిక్ టైటి ల్స్ గెలిచిన పట్నా పైరేట్స్ ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. పునేరి పల్టన్ కెప్టెన్ అస్లాం ఇనామ్‌దార్ 9 పాయింట్లతో మెరిశాడు. 

ఫస్టాఫ్, సెకండాఫ్ ఎక్కడా కూడా పట్నా పునేరికి పోటీ ఇవ్వలేకపోయింది. రైడర్ దేవాంక్ పట్నా తరఫున హై స్కోరర్. పునేరి ఆడిన రెండు గేముల్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్.. యూపీ యోధాస్, బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.