విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇన్విజిలేటర్లు
ఓఎంఆర్ షీట్లపై తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు బబ్లింగ్ చేసిన వైనం
కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Girls Zilla Parishad High School) నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రంలో కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారు. శనివారం పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవోదయ ఎంట్రన్స్ పరీక్ష(Navodaya Entrance Exam) నిర్వహించారు. పరీక్షా సమయం కాగానే ఓఎంఆర్ షీట్ అందించారు. ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ను బబ్లింగ్ చేశారు. కానీ, రావులపెంట మోక్షిత్ అనే విద్యార్థి రోల్ నెంబర్ 3612924 కాగా 9612924 గా బబ్లింగ్ చేయడంతో విద్యార్థి ఇన్విజిలేటర్ ను రోల్ నెంబర్ తప్పుగా దిద్దారని ప్రశ్నించాడు. దీంతో ఇన్విజిలేటర్ 9 అంకెను గట్టిగా రబ్ చేయడంతో రంద్రం పడిందని, అనంతరం మూడు అంకెలు బబ్లింగ్ చేసిందని తెలిపాడు.
అదేవిధంగా జి. గాయత్రి అనే విద్యార్థిని రోల్ నెంబర్ 3612963ని కూడా తప్పుగా బబ్లింగ్ చేసినట్లు ఆరోపించారు. విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారని తెలిపారు. తీరా పరీక్షా కేంద్రంలో వారి జీవితాలతో తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు వేసి ఇన్విజిలేటర్లు చెలగాటం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై సదరు నవోదయ సెంటర్ ఇన్సిరేటర్లన పరీక్ష నిర్వాహకులను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా ఏం చేస్తారో చేసుకోండని తెలిపారని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విషయాన్ని ఆరా తీశారు. పోలీస్ అధికారులు స్పందించి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు.