- 5 సార్లు రాసినట్లే గుర్తించండి
- ఢిల్లీ కోర్టులో పూజా ఖేద్కర్
న్యూఢిల్లీ, ఆగస్టు 30: మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో సంచలన అభ్యర్థన చేసింది. తాను ఇప్పటివరకు 12 సార్లు సివిల్స్ పరీక్ష రాశానని, కానీ అందులో 5 ప్రయత్నాలనే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. తనపై ఐఏఎస్‌గా అనర్హత వేటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఖేద్కర్ సవాలు చేశారు. ఈ మేరకు వాదనలు వినిపిస్తూ.. కీలులో గాయం కారణంగా తన ఎడమ మోకాలు అస్థిరంగా ఉందంటూ మహారాష్ట్ర ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణను చూపిస్తూ దివ్యాంగురాలి క్యాటగిరీలో రాసిన పరీక్షలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు 47 శాతం (నిబంధనల ప్రకారం 40 శాతం దాటితే దివ్యాంగురాలిగా గుర్తిస్తారు) ఉందని కోర్టుకు వెల్లడించారు.
పేరు మొత్తం మార్చలేదు
పేరులో మార్పులు చేసి నిబంధనలకు విరుద్ధంగా 12 సార్లు సివిల్స్ రాసినట్లు కూడా పూజ అంగీకరించడంలేదు. పేరు మధ్యలో చిన్న మార్పు చేశానని, మొత్తం మార్చలేదని పేర్కొన్నారు. యూపీఎస్సీ బయోమెట్రిక్ డాటా కూడా తన గుర్తింపును పరిశీలించిందని తెలిపారు. ఇప్పటికే తాను ప్రొబేషనరీ అధికారిణిగా బాధ్యతలు చేపట్టానని, తన ఎంపికను రద్దు చేసే అర్హత యూపీఎస్సీకి లేదని వెల్లడించారు. ఒకవేళ తనపై చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా డీవోపీటీకి మాత్రమే అర్హత ఉందని పేర్కొన్నారు. ఒకవేళ కోర్టు ఖేద్కర్ అభ్యర్థనను అంగీకరిస్తే ఆమె కేవలం 5 సార్లు మాత్రమే పరీక్ష రాసినట్లవుతుంది. అంగవైకల్యం ఉన్నవారికి 9 పరిమిత ప్రయత్నాలు ఉంటాయి. అందువల్ల మరో 4 సార్లు ఖేద్కర్ పరీక్ష రాసే అవకాశముంటుంది. జనరల్ క్యాటగిరీలోనూ మరోసారి ప్రయత్నించవచ్చు.