‘సీతంబాయి పొలం’ కథల సంపుటి
ఆవిష్కరణ సభలో రచయిత అయోధ్యారెడ్డి
ఈ స్పీడ్ యుగంలో కథలు చదివే పాఠకులు కరువయ్యారు. మరీ ముఖ్యంగా ఈతరం యువత, పిల్లలు తెలుగు సాహిత్యానికి దూరమవుతున్నారు. కానీ, గతంలో ఇటువంటి పరిస్థితి లేదని అయోధ్యారెడ్డి అన్నారు. కథలు రాసేవాళ్ళు కూడా ఇప్పుడు కరువయ్యారు. అప్పటి గొప్ప, పెద్ద రచయితలు, కవులను ఇప్పటి తరం అసలు గుర్తు పెట్టుకోవడమే లేదు. ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. ఈ పరిస్థితులు మారాలి.
తనకు కథలు అంటేనే ఎంతో ఇష్టమని, ఎంతో తపనతోనే ఇప్పటికీ రచనలు చేస్తున్నానని అయోధ్యారెడ్డి చెప్పారు. నిజ జీవిత సంఘటనలే తన కథలకు ఇతివృత్తాలని అన్నారు. యదార్థ జీవన స్పర్షతోనే కథలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. ‘సీతంబాయి పొలం’ తన నాలుగో కథల పుస్తకమని చెప్పారు. అప్పట్లో పత్రికల్లో కథలు అచ్చయితే ఎంతో కొంత గౌరవ రుసుము ఇచ్చేవారని, అలా కొంత డబ్బు సంపాదించుకోవచ్చునన్న ఆశ, ఆలోచనతోనే కథలు రాశానని తెలిపారు. ఆ తర్వాత నుంచీ డబ్బుకు అతీతంగా కథా సాహిత్యాన్ని, రచనా ప్రక్రియను నిజాయితీగా ప్రేమించడం మొదలుపెట్టి అంకితభావంతో రాస్తున్నానని అన్నారు.
తపన లేకపోయినా, పాఠకుల ఆదరణ పొందకున్నా ఎవరూ ఇన్నేసి కథలు రాయరని చెబుతూ, తన పరిస్థితీ అంతేనని అన్నారు. ఎంతో తపనతో ప్రతీ కథనూ సృష్టిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజల యధార్థ, వ్యధార్థ ఆర్ద్ర జీవన అనుభవాలే తనకు కథా వస్తువులు అయ్యాయని, ఏదో టైమ్ పాస్ కోసం తాను కథలు రాయనని అయోధ్యారెడ్డి చెప్పారు. నాలుగు దశాబ్దాల క్రితం మొదలైన తన సుదీర్ఘ కథల అక్షర సాగు కొన్నేళ్ల తర్వాత వృత్తిరీత్యా జర్నలిజంలోకి రావడం వల్ల కొన్నాళ్ళపాటు నిలిచిపోయిందని తర్వాత రిటైర్ అయ్యాక మళ్ళీ సీరియస్‌గా రాయడం ప్రారంభించానని అన్నారు. ఇప్పటికి సుమారు వంద కథలు, రెండు నవలలు రాసిన అయోధ్యారెడ్డి, నలభై విదేశీ కథలు, ఒక విదేశీ నవల అనువదించారు.
అయోధ్యారెడ్డి తాజా కథల సంపుటి ‘సీతంబాయి పొలం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి జర్నలిస్టు కాలనీలో జరిగింది. ప్రముఖ కథా రచయిత, సీనియర్ పాత్రికేయుడు, పూర్వ ‘నవ్య’ వీక్లీ సంపాదకుడు ఏ ఎన్ జగన్నాథశర్మ ఈ కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు.