calender_icon.png 22 December, 2024 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతతో రాయాలి!

30-09-2024 12:00:00 AM

సమాజంపై సాహిత్య ప్రభావం : 

విభిన్న ప్రక్రియలలో కొనసాగుతున్న సాహిత్యం వివిధ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో విస్తృత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సాహిత్యంలోని ఒక్కో ప్రక్రియ ఒక్కో రకంగా ప్రజల జీవితాలపై ప్రభావం చూపే శక్తిని కలిగి ఉంటుంది. ఈ కారణంగా ముఖ్యంగా వచన రచయితలు తాము ప్రవేశం కలిగివున్న ప్రక్రియతోపాటు ప్రజా జీవితాలను ప్రభావితం చేసే అంశాలనూ పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి.

కొన్ని ప్రక్రియలు కేవలం సాహిత్యమని చెప్పుకోవడానికే కానీ, సమాజంపై అంతగా ప్రభావం చూపవు కూడా. ప్రధానంగా గేయాలు, పాటలు ప్రజా జీవితాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. ప్రజల జీవితాలు, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన పాటలు, గేయాలు, కవిత్వం తీవ్ర ప్రభావం చూపుతాయి.

ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం, ఆ కాలంలోని బుర్రకథలు, హరికథలు, ఒగ్గుకథలతోపాటు ఇటీవలి తెలంగాణ తొలి, మలి ఉద్యమాల నేపథ్యంలో విస్తృతమైన సాహిత్యం వ్యాప్తిలోకి వచ్చింది.

ఆయా కాలాలలో ప్రధానంగా పాట తన ప్రభావాన్ని చూపిన తీరు అసామాన్యం. అనేక పాటలు ఉద్యమానికి తలమానికంగా నిలిచాయి. ఇప్పటికీ, ఎప్పటికీ పాటదే పైచేయి. సమస్యను విప్పి చెప్పి కర్తవ్యం వైపు ప్రజల దృష్టిని సారించేలా రూపొందే పాటలది మంచి గొప్ప లక్షణంగా చెప్పాలి. 

అంతిమంగా ప్రజాప్రయోజనమే ముఖ్యం

వచన రూపంలో సాగే వ్యాస ప్రక్రియలో  సందర్భోచితంగా కొన్ని కవితా పంక్తులు, సూక్తులు, పద్య పాదాలు, గేయంలోని భాగాలను కూడా పొందు పరచడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాలలో అంశానికి సంబంధించి ఒక వ్యక్తి లేదా సమూహం తమ భావాలను విప్పి చెప్పినప్పుడు ప్రత్యక్షంగా అదే మాటల్లో పొందు పరచడమూ వ్యాసంలో ఒక కీలకాంశం.

నడుస్తున్న చరిత్ర, దాని వెనుక ఉన్న పూర్వాపరాలు, దానిపైన భిన్నాభిప్రాయాలను, రాబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రచయితలు దగ్గరి దారిలో ప్రజా ప్రయోజనాన్ని అందించే బాధ్యతను చక్కగా నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. రచయిత ముందు ఆత్మవిశ్వాసంతో వాస్తవాలను మాత్రమే సేకరించి, తన ఊహాశక్తితో పరిణామాలను అంచనా వేసి, ఒక ముగింపునకు రావాల్సి ఉంటుంది.

పాలకులు లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ లేదా పౌర సమాజం ఎవరివల్ల వ్యవస్థకు హాని జరుగుతున్నదో దానిని స్పష్టంగా పేర్కొనడం రచయిత కర్తవ్యం. క్షేత్ర స్థాయి పర్యటనలు అనుభవాలతోపాటు సమవయస్కులతో ఆయా అంశాలపైన నిరంతరం చర్చించడమూ రచయితకు చాలా అవసరం.

నిత్య జీవన సంఘర్షణలో సమాజం ఎదుర్కొంటున్న సంక్షోభంలో మెజారిటీ ప్రజానీకం బతకవలసి ఉంటుంది. ఆ పరిస్థితుల నుంచి బయట పడడానికి అవసరమైన మార్గాలను అన్వేషించడమూ రచయిత బాధ్యత. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కొందరిని ఆదర్శంగా చేసుకోవాలి. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా జీవితంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తూ రచనలు సాగించాలి.

అసమానతలు, అంతరాలు, దోపిడీ, పీడన, వంచన వంటివి లేని వ్యవస్థను సాధించడానికి తాను రాసే వ్యాసాలు ప్రజలకు ఒక మంచి దారి చూపగలగాలి. నిత్య జీవితంలో పౌర సమాజమూ తన బాధ్యతలను విస్మరిస్తూ అన్నింటికీ ప్రభుత్వాలు, ఉద్యోగులపైనే ఆధారపడి వ్యవస్థకు ద్రోహం చేస్తున్న సందర్భాలను చూస్తున్నాం. ఈ భావన మారేలా రచనలు సాగాలి.

మంచి రచనలు ఎందుకు రావడం లేదు?

వ్యాస రచన సందర్భంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ, పార్లమెంటు, ప్రజాస్వామిక రాజ్యాంగ సంస్థల పరిధి, పనితీరుపైన వ్యాఖ్యానించేటప్పుడు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడకూడదు. అలాగని, వ్యవస్థలను వాటి లోపాలను దాచి పెట్టవలసిన అవసరం లేదు. శక్తి సామర్థ్యం, సామాజిక స్పృహ, చొరవ, అంకితభావం, ధిక్కార స్వభావం, ప్రశ్నించే ధోరణి వంటి అంశాలపైన ఇతివృత్తం ఆధారపడి ఉంటుంది.

‘ఎవరితో నాకేంటి? అనవసరంగా గొడవ ఎందుకు?’ అనుకొని రాజీ పడే రచయితలు తమ రచనల ద్వారా ప్రజలను ప్రభావితం చేయలేరు. ఊగిసలాట మనస్తత్వం, రాజీ ధోరణి, అవినీతిని కప్పి పుచ్చే ప్రయత్నం చేసే రచయితలు ఉత్తమ రచయితలు కాలేరు. అలాంటి దుర్మార్గపు పద్ధతులకు ఒడిగట్టే వారిని పాఠకులే తిరస్కరిస్తారు.

వ్యాసం రూపాన్ని పరిశీలించినప్పుడు చర్చలకు, సందేహాలకు, ప్రశ్నలకు తావిచ్చేలా ఉండాలి. ఎంత చర్చనైనా ఆహ్వానించడానికి రచయిత సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది మరింత లోతుగా ప్రజల్లోకి వెళుతుంది.

ప్రజల జీవితానికి, వాస్తవానికి దగ్గరగా ఉంటూ అచేతనత్వం నుంచి చైతన్యం వైపు, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు, అవగాహనా రాహిత్యం నుంచి స్థిరమైన స్వతంత్ర ఆలోచనల వైపు పాఠకులను నడిపించేది ప్రయోజనకరమైన వ్యాసం. రాజీ ధోరణితో మర్మగర్భంగా, స్పష్టంగా చెప్పకుండా రాసేవాళ్ళు కొందరు లేకపోలేదు.

అలాంటి రచనలతో సమాజానికి ఏ ప్రయోజనమూ చేకూరదు. రచయితలు వ్యక్తిగతంగా తాము చైతన్యవంతులై, విస్తృత అధ్యయనంతో, అనుభవాలను జోడించి, రంగరించి క్షేత్రస్థాయిలో పర్యటించి, ముగింపునకు రాగలిగితే అద్భుత రచనలు ఆవిర్భవిస్తాయి. ఈ తరహా పరిశోధనాత్మక వ్యాసాలు సమాజంపై అసాధారణ ప్రభావం చూపుతాయి.

రచనలో అంతర్లీనంగా ఒక సిద్ధాంతాన్నీ ప్రతిపాదించాలి. అప్పుడే వ్యాసాలవల్ల సమాజానికి విశాల ప్రయోజనం ఉన్నట్లు లెక్క. ప్రధానమైన ఈ అంశాలపైనే రచయితలు దృష్టి సారించడం వల్ల సాహిత్యానికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. 

సమాజంలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి సాహిత్యం, ప్రసార మాధ్యమాలు, పత్రికలు, సినిమాలను బహుళ శక్తితో ఉపయోగపడే అత్యుత్తమ సాధనాలుగా చెప్పుకోవచ్చు. అన్ని వృత్తులలోకి ఉపాధ్యాయ వృత్తి అగ్రభాగాన నిలిచినట్లే ప్రసార మాధ్యమాలు, సాహిత్యం, పత్రికలకూ అంతకు మించిన స్థాయిలో ప్రాధాన్యం ఉంటుంది.

ఇవన్నీ కలిసి సమాజాన్ని మెరుగైన రీతిలో నడిపిస్తాయి. ఉత్తమ, ఉదాత్త లక్ష్యాలకు అనుగుణంగానే రచయితల కార్యాచరణ ఉండాలి. గమ్యాన్ని చేరుకునే క్రమంలో వారి గమనం సాగనప్పుడు ఎంత ప్రయాణించినా కూడా ప్రయోజనం శూన్యం. ఈ రకంగా తమ లక్ష్యాన్ని బలంగా నిర్వచించుకొని ముందుకు వెళ్లడమే దీనికి పరిష్కారం.

ఒకవైపు సాహిత్యంలో అనేక భిన్న కోణాలు ఉన్నప్పటికీ కొంత సామాజిక మార్పుకు రచయితలు పని చేస్తున్న సందర్భాలనూ మనం గమనించవచ్చు. 

 డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి

9849577610