తెలుసని తెలుసు
కాని, తెలియదు కదా ఈ రాత్రి ఇట్ల రాలిపోతుందని
అన్నిసార్లు ఏరుకుని
మాల కట్టుకున్న కలల పరిమళం
ఇట్లా గాలికి కొట్టుకుపోతున్నదెందుకు
తలుపుతీసి రానిచ్చినందుకు
వెలుతురు ఈ బతుకును ముట్టించింది
కాలిన వత్తిని తీసేసినట్టు
పారేస్తున్నది ఈ దుమారం మనసుని
అప్పట్లో లేతవెన్నెల చినుకుల్ని
ఏరుకున్న యాది మరిచింది కదా కాలం
ఒకవేళ పడవ తానొచ్చినా
నది ఎదురొచ్చి కాళ్ళకు నీళ్ళిచ్చి, కౌగలిచ్చుకుని
కండ్లనీళ్ళు పెట్టుకుంటదా?
యేండ్లసంది పానమెత్తుగ చూసుకున్న
ఇల్లు చిన్నబోయింది
అందరున్నా ఎందుకో దుఃఖం నడిమనసుల కూసుంది
ఎవరన్నా పిలిచి ప్రేమదావతిస్తరా?
మనుషులల్ల భయంతోటి ప్రేమ చచ్చిపోతున్నది
మనుషులెంత రోడ్లమీద పారినా
ఎపుడు కురుస్తది దయగల్ల ప్రేమ
అందరు మేఘాలై దండ కట్టాలె.
శ్రీరామోజు హరగోపాల్