calender_icon.png 26 December, 2024 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

46 కే చుట్టేశారు

18-10-2024 12:00:00 AM

13, 2, 0, 0, 20, 0, 0, 0, 2, 1, 4.. 

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇవీ మన భారత బ్యాటర్లు  చేసిన స్కోర్లు. రెండు వారాల క్రితం బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో క్లీన్‌స్వీప్ చేసిన జట్టేనా ఆడుతుంది అన్న తరహాలో మన ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. క్రీజులో నిలదొక్కుకోవడానికి ఇష్టపడని మన వీరులు పెవిలియన్‌కు క్యూ కట్టడం సగటు అభిమాని జీర్ణించుకోలేకపోయారు.

ఏ పిచ్‌పై మన బ్యాటింగ్ మూగబోయిందో అదే పిచ్‌పై కివీస్ బ్యాటర్లు విజృంభించారు. ఫలితంగా మొదటి టెస్టు తొలి రోజే మ్యాచ్‌ను న్యూజిలాండ్ తమ చేతుల్లోకి లాగేసుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యం..

4 - టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో ఐదుగురు డకౌటవ్వడం ఇది నాలుగోసారి.

3 - టెస్టుల్లో భారత్‌కు (46 పరుగులు) మూడో అత్యల్ప స్కోరు. గతంలో 2020లో ఆసీస్‌పై 36, 1974లో ఇంగ్లండ్‌పై 42 పరుగులకు ఆలౌటైంది.

  1. భారత్, కివీస్ తొలి టెస్టు 
  2. ఐదుగురు బ్యాటర్లు డకౌట్
  3. మాట్ హెన్రీ పాంచ్ పటాకా
  4. పటిష్టస్థితిలో న్యూజిలాండ్

బెంగళూరు: స్వదేశంలో టెస్టుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు న్యూజిలాండ్ బ్రేకులు వేసింది. బెంగళూరు వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా 46 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా టెస్టుల్లో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది.

రిషబ్ పంత్ (20) మినహా మిగతావారు డబుల్ డిజిట్ దాటలేకపో యారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. విలియం రూర్కీ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

ఓపెనర్ డెవన్ కాన్వే (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రచిన్ రవీంద్ర (22), డారిల్ మిచెల్ (14) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, కుల్దీప్, జడేజా తలా ఒక వికెట్ తీశారు.  ఇప్పటికే 134 పరుగుల ఆధిక్యంలో ఉన్న కివీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. 

వికెట్లు టపాటపా..

మొదటి రోజు ఆట వర్షం తో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే రెండో రోజు ఉదయం సెషన్‌లోనూ వర్షం కురవడంతో కాసేపు మ్యాచ్ నిలిపివేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు అది ఎంత పెద్ద తప్పు అనేది కాసేపటికే అర్థమైంది. పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ కివీస్ పేసర్లు చెలరేగిపోయారు. మనకు ఏదైన కలిసొచ్చిందంటే తొలి ఆరు ఓ వర్లు మాత్రమే.

సౌథీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డ్ కావడంతో ఆరంభమైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ పరుగులతో కాకుండా పెవిలియన్ చేరేందుకు పోటీ పడ్డారు. కోహ్లీ, సర్ఫ రాజ్, రాహుల్, జడేజా, అశ్విన్.. డకౌట్లుగా వెనుదిరగడం గమనార్హం.

మధ్యలో పంత్ (20) కాసేపు అడ్డుకోవడంతో భారత్ తన అత్యల్ప స్కోరును (36 పరుగుల చెత్త రికార్డు) తృటిలో తప్పించుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టింది. ఫలితంగా తొలి రోజే కివీస్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. 

పంత్‌కు గాయం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం బారీన పడ్డాడు. కివీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో జడేజా వేసిన స్పన్ బంతిని పంత్ అందుకోవడంలో విఫలమయ్యా డు. దీంతో వేగంగా దూసుకొచ్చిన బంతి పంత్ ఎడమ మోకాలికి బలంగా తాకింది.

నొప్పితో విలవిల్లాడిన పంత్ కుంటుతూనే మైదానాన్ని వీడాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం ఎడమ కాలుకు సర్జరీలు జరిగాయి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు అదే మోకాలికి బంతి తగలడం గమనార్హం.