calender_icon.png 18 January, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్బో.. ఎంత పెద్ద పార్క్!

18-01-2025 12:33:44 AM

వేల చెట్లు.. లక్షల మొక్కలు.. ఎన్నో రకాల పూలు.. వావ్ అనిపించే రైడ్స్.. ఇలా ఎన్నో విశేషాలతో ఆకట్టుకుంటోంది కేరళలోని ‘కుట్టియాడి పార్క్’. ఈ పార్క్‌ను యాక్టివ్ ప్లానెట్ అని కూడా అంటారు. మనదేశంలోనే అతి పెద్ద ప్లే పార్క్‌గా పేరొందింది. దీని విశేషాలు ఏమిటో తెలుసుకుందాం రండి.  

కాంక్రీట్ జంగిల్ కారణంగా నేడు పట్టణా లు, పల్లెల్లో ఎటుచూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్స్ దర్శనమిస్తున్నాయి. కనీసం ఆడుకోవడానికి ఆట స్థలాలు కనిపించడం లేదు. ఇక పా ర్కుల సంగతి అంటారా.. ఎక్కడో శివారు ప్రాంతాల్లో ఉంటున్నాయి. ఫలితంగా పిల్లలు ఆటలకు దూరమవుతు న్నారు. ప్రస్తుతం పార్కులు మచ్చు కైనా కనిపించడం లేదు.  దాంతో పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితమవుతూ ఆటలకు దూరంగా ఉంటున్నారు.

పిల్లలు పార్క్‌కు వెళ్తే ఆ పచ్చిక బయళ్లలో గెంతుతూ.. తుళ్లుతూ ఉంటే ఆ సంతోషమే వేరు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని కుట్టియాడిలోని యాక్టివ్ ప్లానెట్ పార్క్ దేశవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలను ఆకర్షిస్తోంది. ఇది అనేక రకాల ఆటలతో కూడుకున్న పార్క్. ఈ పార్క్ పది ఎకరాల్లో పూర్తిగా పిల్లల కోసమే రూపొందించారు. అయితే పెద్దలు సైతం ఇక్కడికి వచ్చి ఆనందంగా గడుపుతుంటారు.

ఒత్తిడికి దూరంగా.. 

చదువుల ఒత్తిడితో ఇబ్బందిపడే పిల్లలు ఆటలాడుతూ, పర్యావరణంతో మిళితమవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న పచ్చదనం అందర్నీ ఆహ్లాదంలో ముంచెత్తుతుంది. ఇక్కడ సుమారు వెయ్యి చెట్లు, 2.3 లక్షల మొక్కలు, 50 వేల రకాల పూలు ఉన్నాయి.

ముఖ్యంగా ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు ఆడుకునేందుకు రకరకాల ఆటలు అందుబాటులో ఉంటాయి. 40 రకాల రైడ్స్ ఉన్నాయి. దీంతోపాటు వారిలో కళల పట్ల ఆసక్తి, అవగాహన పెంచేందుకు వారాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా కళాకారులను ఆహ్వానిస్తారు. అందులోనూ స్థానిక జానపద కళలకు ప్రాధాన్యమిస్తారు. 

మ్యాంగో ఫెస్టివల్

అన్ని పండ్లకన్నా మామిడి రుచే ప్రత్యేకంగా ఉంటుంది. భారతీయ పండుగలు, ఆచారాలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టే కోజికోడ్‌లో ప్రతి సంవత్సరం మ్యాంగో ఫెస్టివల్ జరుగుతుంది. ఈ సమయంలో వెళ్తే ఎన్నో రకాల మామిడి పండ్లను ఆస్వాదించవచ్చు. వాటి గురించి తెలుసుకోవచ్చు.

అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల రుచులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫుడ్ ట్రక్కులు ఉండటం ఈ పార్క్ ప్రత్యేకత. ఈ పార్క్ ఎంట్రీ ఫీజు రూ.300 నుంచి ఉంటుంది. రెండేళ్ల పిల్లలకైతే ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు. ఈసారి సెలవుల్లో కేరళకు వెళ్తే వీటిని చూసొచ్చేయండి మరి.

వారసత్వానికి ప్రతీకగా

దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోని కోజికోడ్ భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది. కోజికోడ్‌లో 500కుపైగా గ్రంథాలయాలు ఉన్నాయి. కేరళకు చెందిన ప్రముఖ మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ కోజికోడ్‌లో ఉంటూ సాహిత్యరంగానికి ఎనలేని సేవలు అందించారు. కేరళకు వెళ్తే సాహిత్యానికి సంబంధించిన ఎన్నో విశేషాలను తెలుసుకోవచ్చు.

వీటితోపాటు వాటర్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ ఫెస్టివల్, డ్రోన్ లైట్ షో, కైట్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాల నిర్వహణ సమయంలో మన దేశంలోని సెలబ్రిటీలు, రచయితలు ఇక్కడికి వస్తుంటారు. ప్రత్యేకంగా పిల్లల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ ప్లే పార్క్ సమీపంలో అనేక పర్యాటక ప్రదేశాలు, జలపాతాలు కూడా ఉన్నాయి.