- బెల్లంపల్లి ప్రాంతంలో భయభయం
- అయిదు రోజులుగా సంచరిస్తున్నట్లు అనుమానాలు
- ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న అటవీ అధికారులు
- అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్న ప్రజలు
బెల్లంపల్లి, ఫిబ్రవరి 4: బెల్లంపల్లి ప్రాంతాన్ని అయిదు రోజులగా పులులు భయపెడుతున్నాయి. బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీప్రాంతంలో పెద్దపులి మకాం వేసి సంచరిస్తోంది. గత నెల 30న సాయంత్రం కాసిపేట మండలం బుగ్గగూడెం పరిసర ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్న విషయాన్ని అటవీ అధికారులు వెల్లడించారు.
పులి కదలికలపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో గతనెల 31న ఉదయం కన్నాల అటవీప్రాంతంలో ఫారెస్ట్ శాఖ ఏర్పాటు చేసిన నీటికుంటలో నీళ్లు తాగుతూ పెద్దపులి అటవీ సిబ్బందికి ప్రత్యక్షమైంది.
దీంతో అటవీశాఖ బెల్లంపల్లి రేంజ్ అధికారి పూర్ణచందర్ నేతృత్వంలో సిబ్బంది పెద్దపులి కదలికలను గుర్తించే పనిలో పడ్డారు. కన్నాల అటవీప్రాంతంలో పలు చోట్ల పెద్దపులి పాదముద్రలను సేకరించి సమీప అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
అదేరోజు మధ్యాహ్నం కన్నాల అడవుల్లో కనిపించిన పెద్దపులి అటవీప్రాంతానికి ఆనుకొని ఉన్న కుంటరా ఖి నీలగిరి ఫ్లాంటేషన్ మీదుగా కాసిపేట మండలంలో ఉన్న పెద్దనపల్లి ప్రాం మామిడి తోటల వైపు వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. అటవీ అధికారులు కూడా పెద్దనపల్లి అటవీప్రాంతాన్ని పులికోసం సిబ్బందితో జల్లెడ పడుతున్నారు.
పెద్దపులి కాసిపేట వైపు వెళ్లిపోయి ఉంటుందని భావించిన అటవీ సిబ్బందికి జనవరి 1న మళ్లీ పెద్దపులి కన్నాల అటవీప్రాంతంలో అడవిపందిపై దాడి చేస్తూ కనించడంతో నివ్వెరపోవాల్సి వచ్చింది. కన్నాల అటవీప్రాంతంలో పెద్దపులి మకాం వేసిందని గుర్తించిన అటవీ సిబ్బంది సమీప గ్రామాల ప్రజలతో పాటు బుగ్గ దేవాలయానికి వెళ్లే భక్తులను, రైతులను గ్రామాల్లో తిరిగి అప్రమత్తం చేశారు.
ఎవరు కూడా అటవీప్రాంతంలో ఉరులు, కరెంట్ తీగలు పెట్టొద్దని హెచ్చరించారు. బెల్లంపల్లి, బుగ్గగూడెం నుంచి బుగ్గదేవాలయానికి వెళ్లే రహదారులను తాత్కాలికంగా మూసేశారు. నాలుగు రోజులుగా ఎనిమల్ ట్రాకర్స్ సహాయంతో పెద్దపులి సంచరిస్తున్న కన్నాలబుగ్గ అటవీప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ పెద్దపులి కదలికలపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
40 ఏండ్లుగా బుగ్గ అటవీప్రాంతంలో ఎప్పుడూ కనిపించని పెద్దపులి ఒక్కసారిగా కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమీప అటవీ గ్రామాలైన కన్నాల, లక్ష్మీపూర్, కుంటరాములుబస్తీ, గోండుగూడెం, అంకుశం, కరిశెలఘట్టం, బుగ్గగూడెం గ్రామాల ప్రజలు అనుక్షణం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు.
కన్నాల అటవీ ప్రాంతాల్లోని పొలాల్లోకి రైతులెవరూ వెళ్లడం లేదు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు అటువైపు వెళ్లడం లేదు. పెద్దపులి అడవిపందిపై దాడి చేసిన అటవీప్రాంతంలో బేస్‌క్యాంప్ ఏర్పాటు చేసి అటవీ సిబ్బందిని పులిని గుర్తించే పనిలో ఉంచగా శనివారం తెల్లవారుజామున బెస్‌క్యాంప్ పక్కనుంచే పెద్దపులి తిరుగుతుండటం చూసి అటవీ సిబ్బంది హైరానా పడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడి నుంచి బేస్ క్యాంప్ ఎత్తేశారు.
జంట పులుల సంచారంతో భయాందోళనలు
నాలుగు రోజులుగా కన్నాల పెద్దబుగ్గ అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండగా ఈ అడవులను ఆనుకొని ఉన్న చిన్నబుగ్గ అటవీప్రాంతంలోని పోలీస్‌ఫైరింగ్ రేంజ్ వద్ద ఆదివారం చిరుత, పెద్దపులి సంచరిస్తున్న విషయం వెలుగు చూడటం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది.
ఫైరింగ్ రేంజ్‌కు అతి సమీపంలోనే కుంటరాములుబస్తీ ఉంటుంది. అటవీ సిబ్బంది ఈ ప్రాంతంలో జంటపులులు సంచరిస్తున్నట్లు వెల్లడించడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికే కుంటరాములుబస్తీలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.
పిల్లలెవరూ బయటికి వెళ్లి ఆడుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఉదయం వాకింగ్‌కు ఎవరూ వెళ్లొద్దని పలువురికి అటవీ సిబ్బంది హెచ్చరించడంతో బయటికి వచ్చేందుకు సైతం స్థానికులు జంకుతున్నారు.
తిర్యాణి నుంచి కన్నాల అడవుల్లోకి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల నుంచి గత కొన్ని రోజుల కిందట బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీప్రాంతంలోకి బీ2 అనే పెద్దపులి వచ్చినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. 40 ఏళ్లుగా కన్నాల అటవీప్రాంతంలో కౄరమృగాల ఆనవాళ్లు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.
తాజాగా మూడు నెలల కిందట కాసిపేట మండలంలోని దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని రైల్వేలైన్ దగ్గర పులి కనిపించి కార్మికులను భయపెట్టింది. అక్కడే ఆవుల మందపై దాడి చేసింది. తిరిగి ఆ ప్రాంతం నుంచి మందమర్రి పంప్‌హౌప్ వద్ద సంచరిస్తూ స్థానిక పశువుల కాపరుల కంటికి చిక్కింది.
అక్కడి నుంచి అదేరోజు రాత్రి బెల్లంపల్లి మండలంలోని దుబ్బ అటవీప్రాంతంలో తిరుగుతూ పత్తి చేనులో గుడిసెలు వేసుకొని ఉన్న మహారాష్ట్ర పత్తి కూలీలకు కనిపించడంతో వారు పెద్దగా కేకలు వేశారు. దీంతో సమీపంలోని మందమర్రి మండలంలోని శంకర్‌పల్లి అడవుల్లోకి వెళ్లింది.
అప్పటి నుంచి కనిపించని పెద్దపులి ఒక్కసారిగా కన్నాల అడవుల్లో అయిదు రోజుల కిందట ప్రత్యక్షమై హడలెత్తిస్తుంది. ప్రస్తుతం పెద్దపులి కదలికలను పసిగట్టేందుకు అటవీ సిబ్బంది పలుచోట్ల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.