calender_icon.png 26 December, 2024 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహ్ చాయ్!

30-11-2024 12:00:00 AM

చలికి వెచ్చదనం చాయ్.. ఇంటికి ఎవరన్నా వస్తే పలకరించే సంప్రదాయం చాయ్.. ఫ్రెండ్స్‌తో కబుర్లు పెట్టించేది చాయ్.. చిటికెలో తలనొప్పిని మాయం చేసేది చాయ్.. ఇది మన సంప్రదాయంలో ఒక భాగం. ముఖ్యంగా చాయ్ ప్రియులకు ఇదొక ఔషధం. ఒక్కపూట చాయ్ మిస్ అయితే..  రోజంతా ఏదో కోల్పోయిన 

భావనతో గడిపేస్తారు. అయితే చాయ్‌ని ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

ఏళ్లుగా అలవాటైపోయిన చాయ్‌ని వదిలిపెట్టడం అంత ఈజీ కాదు కదా.. మరి దానికి బదులుగా చాయ్‌లో మీకిష్టమైన ఫ్లేవర్లలో హెర్బల్ టీని ఆస్వాదించవచ్చని చెబుతున్నారు ఆయుర్వేద 

నిపుణులు. మరెందుకు ఆలస్యం కింది చాయ్‌లను ఓసారి ప్రయత్నించండి.   కొవిడ్ తర్వాత ఆరోగ్యంపట్ల శ్రద్ధ బాగా పెరిగింది. ఏది తినాలన్నా.. ఏది తాగాలన్నా.. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అయితే చాలామంది మాత్రం నేచురల్ ఫుడ్‌కే ‘జై’ కొడుతున్నారు.

ఎలాంటి రసాయనాలు లేని సేంద్రియ ఆహారపదార్థాలకు, ప్రకృతిలో లభించే సహజమైన వాటినే ఎంచుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతిదీ ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. దాంట్లో ఒకటి హెర్బల్ టీలు.. హెర్బల్ టీల వల్ల కలిగే నష్టాలు, లాభాలేంటో ఓసారి చూద్దాం..    

రోజ్ టీతో ఆరోగ్యం

రోజ్ టీ తయారు చేసుకోవడానికి నీటిలో నాలుగైదు ఎండబెట్టిన గులాబీ ఆకులను తీసుకోవాలి. అందులో కొన్ని ధనియాలు, చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా సోంపు గింజులను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. పూర్తిగా మరిగిన తర్వాత వడగట్టేసుకుని తాగడమే. ఈ రోజ్ టీ మంచి రంగు, రుచిని కలిగి ఉంటుంది. 

లాభాలు: జీర్ణక్రియ శక్తిని పెంచుతుం ది. ఇది సీజనల్ వ్యాధులకు ఔషధంగా పని చేస్తుంది. 

జిలకర చాయ్

సగం చెంచా జిలకరలో చిన్న అల్లం ముక్క, కొన్ని ధనియాలు, రెండు లవంగాలు, కొద్దిగా బెల్లం వేసుకుని ఐదు నిమిషాలు మరిగించాలి. కావాలంటే ఇందులో కొన్ని పాలు పోసుకోవచ్చు. బాగా మరిగాక వడగట్టిన టీలో యాలకుల పొడి వేసుకుంటే రుచి బాగుంటుంది. 

లాభాలు: జిలకర చాయ్ ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా సహకరిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. 

లవంగం చాయ్

రెండు, మూడు లవంగాలను నీటిలో వేసుకుని ఐదు నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత వడగట్టుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగేస్తే సరిపోతుంది. 

లాభాలు: ఈ లవంగం చాయ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. శ్వాసకోశ సమస్యలను, పేగు సిండ్రోమ్‌ను అదుపు చేస్తుంది. 

దాల్చిన చెక్కతో..

ఒక గ్లాసు నీటికి సరిపడా దాల్చిన చెక్కను తీసుకోవాలి.. దాంట్లో కొద్దిగా శొంఠి వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత వడగట్టి తాగితే సరిపోతుంది. 

లాభాలు: ఈ చాయ్.. కఫంతో కూడిన దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ అలెర్జీలు, తలనొప్పికి చక్కని ఔషధంగా పని చేస్తుంది. 

యూకలిఫ్టస్ చాయ్

యూకలిఫ్టస్ చాయ్ (నీలగిరి ఆకులతో) కోసం కొన్ని నీలగిరి ఆకులను లేదా మార్కెట్‌లో లభించే నీలగిరి ఆకుల పౌడర్‌ను తీసుకుని వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తర్వాత వడగట్టి.. దాంట్లో ఒక చెంచా తేనెను కలిపి తాగేస్తే సరిపోతుంది.

లాభాలు: ఈ చాయ్ ఆందోళనను, ఒత్తిడి తగ్గిస్తుంది. అలాగే జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు కూడా దూరం అవుతాయి.

ఉపయోగాలు

హెర్బల్ టీ అంటే?

ఆయుర్వేదంలో ఎన్నో ఆరోగ్యవంతమైన పానీయాలను కనుగొన్నారు మన పూర్వీకులు. అందులో ఫాంటా ఒకటి. ఫాంటాకు మరో పేరే చాయ్. వివిధ ర కాల పూలు, వేర్లు, మొగ్గలు, బెరడు, ఆకు లు, పళ్లు, గింజలు లేదా ఔషధ గుణాలున్న మొక్కలకు చెందిన ఏ భాగం తోనైనా తయారయ్యే టీని హెర్బల్ టీ అంటారు. హెర్బల్ టీలో మంచి సువాసన, రుచి, రోగ నిరోధక శక్తిని పెంపొం దించే సుగుణాలు పుష్కలంగా ఉంటాయి. 

* హెర్బల్ చాయ్‌లు తాగడం వల్ల కిడ్నీ, లివర్ మీద ఒత్తిడి తగ్గించి అక్కడ పేరుకున్న మలినాలను బయటికి పంపేస్తాయి. 

* నిద్రలేమిని పోగొడతాయి. ఆందోళనను తగ్గించి, మనసు, శరీరం ప్రశాంతంగా చేసి హాయిగా నిద్ర పట్టేటట్లు చేస్తాయి. 

*  తలనొప్పి నుంచి ఆర్థరైటిస్ వరకూ అనేక సమస్యలను కంట్రోల్ చేస్తాయి. 

నష్టాలు!

* హెర్బల్ చాయ్ తయారు చేసుకునే ముందు అందులో వాడే హెర్బ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. హెర్బ్స్ చూడటానికి ఒకేలా ఉన్నా..  ఒంటికి పడవు. అలాంటప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుని.. మీ శరీరానికి పడే హెర్బ్స్‌ను వాడాలి. 

* ఒకవేళ హెర్బల్ టీలు పడకపోతే అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కడుపు నొప్పి, దురదతో పాటు ఫుడ్ పాయిజన్స్‌గా కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే హెర్బల్ చాయ్ ప్రయత్నించే ముందు డాక్టర్‌తో మాట్లాడటం అవసరం. 

* హెర్బల్ టీలు కొంచెం కొంచెమే తీసుకోవాలి. అవి కొద్దిగా తీసుకుంటే ఎంత ఆరోగ్యమో.. ఎక్కువగా తీసుకుంటే అంతే అనారోగ్యం. హెర్బల్ టీని రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు తీసుకుంటే మంచిది. 

* మీరేదైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఆ మెడిసిన్స్‌కు ఈ హెర్బల్ టీకి పడుతుందో.. లేదో.. తెలుసుకోవాలి. మెడిసిన్స్ ప్రభావం హెర్బల్ టీ కూడా ఇస్తే రెండూ కలిపి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్‌కు దారి తీస్తాయి.