calender_icon.png 30 November, 2024 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహ్ పంబన్ బ్రిడ్జి!

30-11-2024 03:58:18 AM

దేశంలోనే తొలి వర్టికల్ సీ బ్రిడ్జి

సముద్రంపై ఇంజినీరింగ్ అద్భుతం 

త్వరలోనే అందుబాటులోకి వంతెన

రామేశ్వరం, నవంబర్ 29: తమిళనాడులోని రామేశ్వరం వద్ద నిర్మించిన కొత్త పంబ న్ బ్రిడ్జి వాహ్ అనిపిస్తున్నది. దేశంలోనే మొదటి ఆటోమేటెడ్ ‘వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి’గా కొత్త వంతెన చరిత్రకెక్కింది. ఈ నూతన బ్రిడ్జి ఫొటోలను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. బ్రిడ్జి నిర్మాణాన్ని ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతంగా వర్ణించారు. ఈ ప్రాజెక్టును వేగం, భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు.

105 ఏండ్ల నాటి పాత వంతెన స్థానంలో ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. రామనాథపురం జిల్లాలోని మండపం, రామేశ్వరం మధ్య 1914లో పాత వంతెనను నిర్మించారు. బ్రిడ్జి తుప్పు పట్టిన కారణంగా 2022 నుంచి రాకపోకలను ఆపివేశారు. దాని పక్కనే 2019లో కొత్త బ్రిడ్జికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. త్వరలోనే కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రానుందని వెల్లడించారు. కాగా 2.06 కిలోమీటర్ల పొడవైన పాత పంబన్ బ్రిడ్జిని అప్పట్లో రూ. 20 లక్షలతో నిర్మించారు.

2006 దీనిని మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు,  ఓడలు వెళ్లాలంటే 16 మంది సిబ్బంది పనిచేసి బ్రిడ్జిని తెరిచేవారు. దీంతో సమయం వృథా అయ్యేది. కానీ ప్రస్తుతం ట్రాక్‌తో నిర్మించిన వంతెనను పూర్తిగా ఆటోమేటిక్‌గా పైకి లిఫ్ట్ చేసేలా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించారు. ఇన్నాళ్లు రామేశ్వరాన్ని దేశంతో అనుసంధానం చేసిన పాత వంతెన చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ రూ.535 కోట్లతో నిర్మించారు.