calender_icon.png 27 November, 2024 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 29 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది

26-11-2024 11:56:38 PM

నాటి ఉద్యమ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలి

శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్

కరీంనగర్ (విజయక్రాంతి): భారతదేశ చరిత్రలో నవంబర్ 29 సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజని, ఆ రోజు తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజని శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. మంగళవారం పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన దీక్షాదివస్ సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిందంటే అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తేనని అన్నారు. ఆనాడు వలసపాలన మీద తెలంగాణ పోరాటం చేశాం.. మళ్లీ అదే పరిస్థితి రాబోతుంది, ప్రజలు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ నామస్మరణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సమావేశం జరపడం లేదని, రేవంత్ రెడ్డి ప్రతి సభలో కేసీఆర్ స్మరణే చేస్తున్నారని అన్నారు. మళ్లీ ఉద్యమ స్పూర్తిని నింపేలా దీక్షా దివస్ కార్యక్రమం జరగాలని అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో మళ్లీ దీక్షా దివస్ కార్యక్రమం ఆరంభంతో మరో పోరాటం చేయబోతున్నామన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ దీక్షా దివస్ సభకు 20 నుంచి 30 వేల మందికి తగ్గకుండా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మళ్లీ గులాబీజెండా ఎగిరి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ నాలుగు కోట్ల మంది గుర్తుంచుకునేలా దీక్షాదివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్ష చేసిన అల్గునూరు వద్దనే దీక్షా దివస్ సభ ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ  శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాయల సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌తోపాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.