* సంక్రాంతి రద్దీ.. 366 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): కొత్తగా ఏర్పాటైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ సంక్రాంతి వేళ ప్రయాణికుల కష్టాలను తీరుస్తోంది. ఇక్కడి నుంచి దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను వివిధ గమ్యస్థానాలకు నడుపుతోంది. ఇక్కడి నుంచి ఏకంగా 59 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. తిరుపతి, నర్సాపూర్, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం మార్గంలో ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇందులో 16 అన్‌రిజర్వ్‌డ్ (జనసాధారణ్) రైళ్లున్నాయి. ఫలితంగా అనేక మంది సంక్రాంతి కోసం సులభంగా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడింది. మరోవైపు చర్లపల్లికి చేరుకునేందుకు ఆర్టీసీ సికింద్రాబాద్, బోరబండ, చెంగిచర్ల, మెహిదీపట్నం, ఈసీఐఎల్ నుంచి 146 సిటీ బస్సులను నడిపిస్తోంది.
వీటికి తోడు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా చర్లపల్లి మీదుగా నడిపిస్తుండటంతో ప్రయాణికులు చర్లపల్లిని చేరుకోవడం సులభమవుతోంది. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే 366 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉన్నాయి. నర్సాపూర్, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం, మచిలీపట్నం, తిరుపతి, బెర్హంపూర్, జైపూర్, గోరఖ్‌పూర్, కటక్, మధురై, అర్సికెరె తదితర గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వరంగల్‌కు సైతం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు తెలిపారు.