calender_icon.png 24 October, 2024 | 4:03 AM

ప్రపంచంలో తొలి సీఎన్‌జీ బైక్

06-07-2024 03:18:13 AM

పూణే, జూలై 5: ప్రపంచంలో తొలి సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ను బజాజ్ ఆటో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.95,000 ప్రారంభధరతో (ఎక్స్‌షోరూమ్) ప్రవేశపెట్టిన ఈ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ తొలిదశలో మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో అందుబాటులో ఉంటుందని, తదుపరి ఇతర నగరాల్లో విడుదల చేయనున్నట్టు బజాజ్ ఆటో తెలిపింది. తమ ఆథరైజ్డ్ షోరూమ్‌ల్లోనూ, అధికారిక వెబ్‌సైట్‌లోనూ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ శుక్రవారం పూణేలో ఈ సీఎన్‌జీ బైక్‌ను ఆవిష్కరించారు. 

ట్విన్ ట్యాంక్ సెటప్

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్‌కు ఒకటి పెట్రోల్‌కు, మరొకటి సీఎన్‌జీకి ట్విన్‌ట్యాంక్‌ను అమర్చారు. ఏ ఇంధనాన్ని అయినా ఉపయోగించుకునేందుకు పెట్రోల్, కంప్రస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)లకు రెండు వేరువేరు స్విచ్‌లు ఉంటాయి. ఇదేతరహా పెట్రోల్ మోటర్‌సైకిళ్లతో పోలిస్తే ఫ్రీడమ్ 125 బైక్‌తో దాదాపు 50 శాతం ఇంధనం ఆదా అవుతుందని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ చెప్పారు. ఈ బైక్ కేజీ సీఎన్‌జీతో 102 కిలోమీటర్లు నడుస్తుందని, ఫుల్ ట్యాంక్ సీఎన్‌జీతో దాదాపు 200 కిలోమీటర్ల మైలేజి వస్తుందన్నారు.

సీఎన్‌జీ ట్యాంక్ ఖాళీ అయితే దీనికి అమర్చిన 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ద్వారా 130 కిలోమీటర్లు కవర్ చేస్తుందని వివరించారు. బజాజ్ ఫ్రీడమ్ 125 మూడు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ ధర రూ.95,000కాగా, డ్రమ్ లెడ్ వేరియంట్‌కు రూ.1.05 లక్షల ధరను నిర్ణయించారు. టాప్‌ఎండ్ వేరియంట్ డిస్క్ లెడ్ రూ.1.10 లక్షల ధరతో లభిస్తుంది. ఎబొనీ బ్లాక్, కారేబియన్ బ్లూ, సైబర్‌వైట్, రేసింగ్ రెడ్, ప్యుటర్ గ్రే ఐదు రంగుల్లో బైక్‌ను ఆఫర్ చేస్తున్నారు.