calender_icon.png 19 March, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌత్ క్యాంపస్ లో ఘనంగా ప్రపంచ సోషల్ వర్క్ దినోత్సవం

18-03-2025 10:38:06 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సోషల్ వర్క్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి WORD అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మల్లవరపు ప్రసాద్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... ప్రతీ సంవత్సరం మార్చి నెల మూడవ వారం ఈ ప్రపంచ సోషల్ వర్క్ దినోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. ఈ దినాన్ని ప్రపంచ సోషల్ వర్క్ స్కూల్స్ తో కూడిన ప్రపంచ సోషల్ వర్క్ అసోసియేషన్ ప్రకటించింది అని అన్నారు. ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్ ను తీసుకుంటారని ఈ సంవత్సరం "తరాల మధ్య సంఘీభావం, సహనాన్ని పెంచడం" అనే అంశాన్ని తీసుకున్నారని అన్నారు.

నేడు సమాజంలో తరాల మధ్య అంతరం పెరిగిందని, అందుకే మానసిక సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు రావడం వల్ల కుటుంబ వ్యవస్థ పోయి ఒకరికొకరు సహకారం కొరవడిందని అన్నారు. అలాగే తమ సంస్థ ఎయిడ్స్ రోగులకోసం పని చేస్తుందని అందువల్ల తాము సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నమని అన్నారు. అన్ని జబ్బుల్లాగే ఇది ఒక జబ్బు అన్నారు. సమాజంలో దీనిపై వివక్ష పోవాలని అన్నారు. సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ... నేటి సమాజంలో సోషల్ వర్క్ విద్యార్థుల బాధ్యత ఉందని అన్నారు. ఎన్నో సామాజిక రుగ్మతలు ఉన్నాయని వాటిని రూపు మాపాలని కోరారు. సోషల్ వర్క్ హెడ్ డా.అంజయ్య బందెల మాట్లాడుతూ... సోషల్ వర్క్ విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యత ఉండాలని తెలిపారు.

అందుకే వివిధ స్వచ్చంధ సంస్థల దగ్గరికి పరిశీలన నిమిత్తం విద్యార్థులను పంపుతామని తెలిపారు. అలా కాకుండా ఈరోజు సంస్థలే తమ దగ్గరికి వచ్చాయని వాటి నుంచి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించి సామాజిక కార్యకర్తలుగా పని చేస్తున్నారని వారిమార్గంలో అందరూ భవిష్యత్ నిర్మించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి, సోషల్ వర్క్ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ డా.వీరభద్రమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ సంస్ధల స్టాల్ లను ఏర్పాటు చేసారు. సఖి సెంటర్ కామారెడ్డి, WORD సంస్థ నిజామాబాద్, సాధన స్వచ్ఛంద సంస్థ, చైల్డ్ రైట్స్ సంస్థ-కామారెడ్డి, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు తమ తమ సంస్థలు అందిస్తున్న సేవలను వివరించారు.

న్యాయ సేవా సంస్థ శిబిరం ఏర్పాటు చేశారు. తాము అందిస్తున్న న్యాయ సేవలను వివరించారు. జిల్లా జడ్జి టీ.నాగరాణి శిబిరాన్ని ప్రారంభించారు. రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. విద్యార్థులు రక్తదానం చేశారు. వివిధ సంస్థలలో ఉద్యోగాలు సంపాదించిన పూర్వ విద్యార్థులకు, స్వచ్చంధ సంస్థ ప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్ డా.యాలాధ్రి, డా.నర్సయ్య, డా.రమాదేవి, డా.సంతోష్ గౌడ్ వివిధ విభాగాల అధ్యాపకులు డా.సబిత, డా.మోహన్ బాబు, డా.లలిత, డా.హరిత, APRO డా.సరిత పీట్ల, ఉమెన్స్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, డా.నారాయణ, డా.కనకయ్య, అనుబంధ కళాశాలల అధ్యాపకులు డా.రమేష్, పరిశోధక విద్యార్థి డా. పిబి.సత్యం తదితరులు పాల్గొన్నారు.