27-02-2025 02:15:30 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): భారత ఫార్మారంగంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని, బల్క్‌డ్రగ్ క్యాపిటల్‌గా, వ్యాక్సిన్ హబ్‌గా ఐటీ ఎగుమతుల్లో లీడర్‌గా హైదరాబాద్ ఖ్యాతి గడించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ముత్యాల నగరం మాత్రమే కాదని, ప్రపంచ ఫార్మసీ నగరంగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రుల హబ్‌గా మారిందన్నా రు.
అందరం కలిసి హెల్త్‌కేర్ రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుదామని ఆయా దేశాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో ‘బయో ఏషియా-2025’ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బయో ఏషియా స్టాల్స్‌లో ప్రదర్శించిన టాప్-5 స్టార్టప్‌లకు అవార్డులు అందజేశారు.
అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. 800 ఫార్మా, బయో టెక్, మెడిటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాయన్నారు. ఐఐటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (నైపర్), సీసీఎంబీ, ఐఎస్‌బీ, నల్సార్, డీఆర్‌డీవో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ప్రతిభావంతులు ఆయా రంగాల్లో సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివెజైస్ పార్కు వం టివి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సెన్సైస్ ఎకానమీ సృష్టి దిశగా అడుగులు వేసే అవకాశాలు హైదరాబాద్‌లో మెండుగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచ అవసరాల్లో 60 శాతానికి పైగా వ్యాక్సిన్లు, 20శాతం జెనరిక్ మందులను భారత్ నుంచే సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
2014లో 15 బిలియన్ డాలర్లు ఉంటే, 2024 నాటికి 27.85 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు స్పష్టం చేశారు. కేంద్రం సహకారం తోనే ఈ అనూహ్య మార్పు జరిగినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఆర్థిక సంస్కరణల వల్ల దేశం త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రూ.1.2లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు
2024లో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీల ద్వారా రూ.1.2లక్షల కోట్ల ఐటీ సేవలు ఎగుమతులు జరిగినట్లు కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర తీసుకొచ్చిన ‘మెడ్‌టెక్ మిత్ర’ వంటి వేదికలు ఆవిష్కర్తలకు, స్టార్టప్స్, భా గస్వామ్యపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతు న్నాయన్నారు.
మానవ వనరులకు హబ్ తెలంగాణ: శ్రీధర్‌బాబు
తెలంగాణను మానవ వనరులకు హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌పై తాము దృష్టి పెట్టామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బయో ఏషియా సదస్సుకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చినట్లు చెప్పారు. బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
దేశ, విదేశాల నుంచి 4వేల మంది ఫార్మా,హెల్త్ కేర్ ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్స్, ఆవిష్కర్తలు హాజరైనట్లు చెప్పారు. 200కు పైగా బీటూబీ(బిజినెస్ టూ బిజినెస్) మీటింగ్స్ జరిగాయని, గతేడాది కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు వచ్చినట్లు వివరించారు. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘ఆమ్జెన్’ భారీ గా పెట్టుబడి పెట్టిన సంస్థల్లో ఒకటని, దీనివల్ల మూడు వేల మందికి ఉపాధి దక్కుతుం దన్నారు. మొత్తం 84 స్టార్టప్స్ ఈ ఏడాది సదస్సులో పాల్గొన్నాయని వెల్లడించారు.
లగచర్లలో పర్యావరణహిత పరిశ్రమల ఏర్పాటు
లగచర్లలో ఫార్మా పరిశ్రమల కాకుండా పర్యావరణహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారన్నారు. తమ ప్రభుత్వం ప్రజలు తెలిపే నిరసన, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. బుధవారం బయో ఏషియా-2025 సదస్సు ముగిసిన తర్వాత శ్రీధర్‌బాబు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైఫ్ సెన్సైస్ పాలసీపై త్వరలోనే క్యాబినేట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్‌సెన్సైస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, ఎక్కడ ఏర్పాటు చేయాలనేది త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
భారత్‌లో అపార అవకాశాలు
కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): దేశంలోని బయోటెక్ పరిశోధన కేంద్రాలకు తెలంగాణ నిలయంగా మారిందని, హెల్త్‌కేర్ సెక్టార్‌కు హబ్‌గా నిలిచిందని కేంద్ర పరిశ్రమల శాఖమంత్రి పీయూశ్ గోయల్ చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో ఆర్థికంగా పుంజుకుంటోం దని, ఈక్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రయోజనం పొందినట్లు చెప్పారు.
బుధవారం బయో ఆసియా-2025 ముగింపు సదస్సుకు గోయల్ వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు.. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ, బయోఫార్మా, మెడికల్, డివైజెస్ రంగాలపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.