17-02-2025 12:00:00 AM
మన మాణిక్యాలు
“భాగవతము తేట పఱుప నెవ్వడు సాలు
శుకుడు దక్క నరుని సకుడు దక్క
బుద్ధి దోచినంత బుధులచే విన్నంత
భక్తి నిగిడినంత పలుకువాడ”
అంటూ ‘భాగవతం’ షష్ఠ స్కంధంలో కనిపించే ఈ పద్యం విన్నంతనే అందులోని అవతారికలో కనిపించే “భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన
విబుధ వరులవలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేట పఱతు”
అన్న పద్యం వెంటనే స్ఫురిస్తుంది. ఈ పద్యం మహాకవి బమ్మెర పోతన రచించిన విషయం లోకమంతటికీ తెలుసు. పై పద్యం కూడా ‘భాగవతం’ లోనిదే కావడం, రచించిన కవి ఏర్చూరి సింగన కావడం విశేషం.
‘భాగవతం’లోని ఆరవ స్కంధం
బమ్మెర పోతన ‘భాగవత’ రచనలో మరో ము గ్గురు కవులకు భాగస్వామ్యం కలిగించిన విషయం తెలుగు సాహితీ ప్రపంచానికి తెలిసిందే. ఏర్చూరి సింగన ‘భాగవతం’లోని 6వ స్కంధం రచించిన కవి. ఇందులోని అనేక పద్యాలు అప్పటి పోతన పద్యాల మార్గంలోనే నడిచినట్లు మనం గుర్తించగలం. అనుప్రాసలు, శబ్దాలంకారాల ప్రయోగాల లో ఈ ఆరో స్కంధం పద్యాలు పోతన్న పద్యాలే మో అన్న భ్రమకు పాఠకుణ్ణి లోను చేస్తాయి. మొదటి నాలుగు స్కంధాల వరకు పోతన్నే రాయ గా 5, 6 స్కంధాల రచనకు ఇతర కవులకు అవకాశం కలిగింది. తాను మళ్లీ 7వ స్కంధం నుంచి 10వ స్కంధం వరకూ రచించాడు. 11, 12 స్కంధాలను తన శిష్యుడైన వెలిగందల నారయకు అవకా శం కలిగించాడు.
గ్రామ నామమే ఇంటిపేరుగా గలిగిన ఏర్చూరి సింగన శ్రీవత్సస గోత్రుడని, ఆపస్తంబ సూత్రుడని ఈ షష్ఠ స్కంధ గద్యనుబట్టి తెలుస్తున్నది. వీరి గ్రామమైన ‘ఏర్చూరు’ నల్లగొండ జిల్లాకు చెందిం ది. వరంగల్లు జిల్లా బమ్మెరకు సమీపంగానే ఉన్న నల్లగొండ జిల్లాలోని ఏర్చూరి వాడైన సింగన పోతన కవిత్వంతో ప్రభావితుడై, పోతన సహకారం కారణంగా భాగవత రచనలో భాగస్వామి కాగలిగాడు. అలా, 530 గద్య పద్యాలున్న ఈ షష్ఠ స్కం ధాన్ని రచించే అదృష్టవంతుడయ్యాడు.
మనకు తెలుగు సాహిత్యంలో ‘ఎర్రన’ నామధే యం కలిగిన వారు ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరైన ఏర్చూరి ఎర్రన అనే వ్యక్తి ఈ ‘ఏర్చూరు’ గ్రామానికి కరణంగా ఉన్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. ఆయన కుమారుడే ఏర్చూరి వీరన. ఈయ న కుమారుడు ఆదయ్య. ఈ ఆదయ్యకు ముగ్గురు కుమారులు కలిగారు. వారిలో ఒకరైన కసువనకు, ఆయన ఇల్లాలు ముమ్మడమ్మకు కలిగిన ఇరువురు పుత్రులలో ‘సింగన’ ఒకడు కాగా, రెండో కుమారుడు తెలగన. ఈ సింగనయే భాగవత షష్ఠ స్కంధా న్ని రచించిన కవి.
పోతన స్మరణతో అందమైన పద్యం
సింగన్న తండ్రి అయిన కసువన్న గొప్ప శివభక్తుడు. అందుకే, అతని పుత్రుడైన సింగన్నకూడా శివ పూజాసక్తుడే అయినట్టున్నాడు. అయితే, వివిధ పురాణేతిహాసాలు, అపూర్వమైన గ్రంథ సంచయా న్ని అధ్యయనం చేసినవాడు కనుక సింగన్న శివు ణ్ణే గాక ఇతర దైవాలపట్ల కూడా ఆరాధనా భావం కలిగిన వాడని స్వయంగా తాను చెప్పుకున్న పద్యాలనుబట్టే మనకు అర్థమవుతున్నది.
“విష్ణుచరితామృత నిష్యంది పటువాగ్వి లాసానందోచిత మాన”సుడన్న మాట ఈ రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. తన రచనలో, పూర్వ తెలు గు కవులను ఘనంగా కీర్తించాడు. నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడ, భాస్కరుడు, నాచన సోముడు, శ్రీనాథుడు మొదలైన తెలుగు కవుల స్తుతిలో వారిపట్ల సింగనకున్న అభిమానం ప్రస్ఫుటమవుతుంది. తనకు ‘భాగవత’ రచనలో భాగస్వామ్యం కలిగించి తరింపజేసిన బమ్మెర పోతనను ప్రత్యేకంగా స్మరిస్తూ
“ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నగ బన్నగ శాయికిన్
సొమ్ముగ వాక్య
సంపదలు సూఱలు
చేసిన వాని భక్తిలో
నమ్మిన వాని భాగవత నైష్ఠికుడై తగువాని బేర్మితో
బమ్మెర పోతరాజు కవి పట్టపురాజు దలంచి మ్రొక్కిదన్”
అన్న అందమైన పద్యాన్ని పోతన శైలిలోనే చెప్పి, పోతన పట్ల ఉన్న తన గౌరవాన్ని విన్నవించుకున్నాడు.
సంస్కృత కవుల స్తుతి, తెలుగు కవుల స్తుతి కోసం ప్రత్యేకంగా ఒక్కో పద్యం చెప్పక పోయినా, పోతన్న స్తుతికి మాత్రం ఒక ప్రత్యేకమైన పద్యాన్నే చెప్పాడు. తద్వార పోతన్నకు తానెంత కృతజ్ఙుడో చెప్పుకున్నట్లయింది. ఈ సందర్భంలోనే తనను కటాక్షించి దర్శనమిచ్చిన జగన్మాత యానతిని పాటించి, రచనకు పూనుకున్న సింగన్న ఇక్కడొక సంస్కృత శ్లోకాన్ని ప్రత్యేకంగా రచించడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుని కీర్తించాడు.
“హంసాయ సత్తనిలయాయ సదాశ్రయాయ
నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ
సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ
సంపూర్ణ పుణ్యపతయే హరయే నమస్తే”
అని ఆ శ్రీమన్నారాయణుని పరమహంస స్వరూపునిగా, సత్తగుణ సంపన్నునిగా, సర్వాంతర్యా మిగా, సజ్జనులకు ఆశ్రయమైన వానిగా కీర్తిస్తూ, ఆ స్వామియే తన కు ఏ ఆధారం అవసరం లేకుం డా స్వయంగా తానే ఆధారమై తనను తరింప చేయాలన్న కోరికతో నమస్కరించాడు.
నలభై ఏడు కథలు
ఈ షష్ఠ స్కంధంలో అజామిళోపాఖ్యానము, శ్రీమన్నారాయణ కవచం, చిత్రకే తూపాఖ్యానం వం టి 47 కథలు చోటు చేసుకున్నా యి. చాలా పద్యా లు పోతన పద్యాలవలెనే ఉన్నా యి. ఈ కారణంగా అవి పోతన రచించినవే కావచ్చునని కొందరు విమర్శకులు భావించారు. కానీ, పలువురు చరిత్రకారులు ‘ఇవి సింగన్నవే’ అంటూ, ‘పోతన్నపై ఈ కవికున్న గౌరవం వల్ల తాను పోతన్నను అనుసరించినట్లు’గా పేర్కొన్నారు. పోతన మహాకవి తమ మాతృమూర్తిని వర్ణిస్తూ
“మానిను లీడుగారు బహుమాన
నివారిత దీన మానస
గ్లానికి దానధర్మ మతిగౌరవ మంజులతా గభీరతా
స్థానికి ముద్ధసానికి సదాశివ
పాదయుగార్చనానుకం
పానయ వాగ్భవానికిని బమ్మెర
కేసయ లక్కసానికిన్”
అని గొప్ప పద్యం రచించాడు. ఈ తేజస్వంతమైన పద్యానికి అబ్బుర పడ్డ సింగన్న కూడా ఇదే ఒరవడిలో
“ఆడదు, భర్తమాట కెదురాడదు
వచ్చిన వారి వీడగా
నాడదు పెక్కుభాష లెడనాడదు
వాకిలి వెళ్లి కల్ల మా
టాడదు మిన్నకేని సుగుణావళి
కిందర గాక సాటి యే
చేడియ? యేరి చూరి
కులశేఖరు కన్వయ ముమ్మడమ్మకున్”
అంటూ చెప్పాడు. ఈ పద్యంలో తన మాతృమూర్తిపై ఎంతటి గౌరవ ప్రపత్తులను కనిపింపజే శాడో, పోతన పద్య నిర్మాణంపై కూడా అంతే గౌర వ ప్రపత్తులను పద్య రచనా ఫణితిలో చూపించాడు సింగన. ఈ విధంగా అనేక సందర్భాలలో సింగన పోతన్నను అనుసరించినట్లు ఈ షష్ఠ స్కంధం నిరూపిస్తున్నది.
తిక్కనను గుర్తుకు తెస్తాడు
అజామిళోపాఖ్యానంలో అజామిళుని వేశ్యా లో లత్వం, దుష్ట సాంగత్యం వంటి వర్ణనలు రచించిన సందర్భంలో తనకు పూర్వుడైన శ్రీనాథ మహాకవిని కూడా అనుసరించే ప్రయత్నం చేశాడు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యములోని సుకుమారుడు, ఇందులోని అజామిళుడు ఏకరూపులుగా కనిపిస్తా రు. అన్ని దుర్లక్షణాలూ ఇతనిలోనూ కనిపించే విధంగా సింగన ఈ వృత్తాంతాన్ని నడిపించాడు. శ్రీనాథుని ‘కవి మనోనాథుని’గా భూషించిన సింగ న ఆయన కవిత్వ ప్రభావంతో కూడా కొన్నికొన్ని సందర్భాల్లో రచించినట్లు అర్థమవుతున్నది. అదే విధంగా తనకన్నా పూర్వుడైన నాచన సోముని ప్రభావం కూడా ఉన్నట్టి సందర్భాలు సైతం ఈ భాగంలో చోటు చేసుకున్నాయి. ఈ షష్ఠ స్కంధం మనం చదువుతున్నప్పుడు తిక్కన సోమయాజి కూడా స్ఫురిస్తుంటాడు.
‘కువలయాశ్వ చరిత్ర’ అలభ్యం
మిక్కిలి ప్రభావవంతమైన విధానాలను పూర్వకవుల స్ఫూర్తితో రచించిన ఏర్చూరి సింగన మార్కండేయ పురాణాంతర్గతమైన కువలయాశ్వుని కథను గ్రహించి ‘కువలయాశ్వ చరిత్ర’ అనే కావ్యం కూడా రచించినట్లు పెదపాటి జగ్గన్న ‘ప్రబంధ రత్నాకరం’ ద్వారా తెలుస్తున్నది. అయితే, ఈ కావ్యం అలభ్యం. అందువల్ల ఇది ఎన్ని ఆశ్వాసాల గ్రంథమో తెలియడం లేదు. పెదపాటి జగ్గన్న తన గ్రంథంలో చేర్చుకున్న పన్నెండు పద్యాలవల్లనే విషయం వెలుగు చూసింది. జగ్గన్న ‘ప్రబంధ రత్నాకరం’లో చేర్చుకున్న సింగన్న ‘కువలాయాశ్వ చరిత్ర’లోని పన్నెండు పద్యాల్లో ఏడు పద్యాలు పురవర్ణనకు సంబంధించినవే కావడం విశేషం. నగరంలోని బ్రాహ్మణులను, వైశ్యులను వర్ణించిన పద్యాలతోపాటు అక్కడి గృహాల ఔన్నత్యాన్ని వర్ణించే పద్యాలు, అదే విధంగా ఆ కాలం నాటి పుణ్యకాంతలను వర్ణించిన పద్యాలను కూడా పెదపాటి జగ్గన్న చేర్చుకున్నాడు. ఇవి కవి ప్రతిభకు దర్పణం పడుతున్నాయి. కువలయాశ్వుడు వేటకు వెళ్లిన సందర్భంలో అరణ్యంలో ఉన్న శబరకాంతలను వర్ణిస్తూ
“గిటగిట నగు నెన్నడుములు
పుటపుట నగు చన్నుగవలు బున్నమ నెలతో
చిటచిట లాడెడు ముఖములు
గటి తలముల యొప్పు శబరకాంతల కొప్పుల్”
అని చెప్పిన పద్యం శబ్ద ప్రయోగ విషయంలో సింగన్నకు ఉన్న ఉత్సుకతను తెలుపుతున్నది. పుత్రోదయాన్ని చంద్రోదయంతో పోల్చి చెప్పడం, అరణ్యంలోని క్రూరమృగాల వేటను వర్ణించడం వంటి విషయాలు ఈ పన్నెండు పద్యాల్లో చూడవచ్చు. దొరికిన పన్నెండు పద్యాలే సింగన ప్రతిభను దర్శింపజేస్తుంటే కావ్యం సంపూర్ణంగా లభ్యమై ఉంటే మనకు ఆయన గొప్పతనం మరింతగా తెలియవచ్చేది.
-గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448