13-04-2025 01:02:51 AM
(ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే సందర్భంగా)
కాలేయం.. మన శరీరంలో అతిముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం దగ్గర నుంచి జీర్ణక్రియ సాఫీగా సాగడం వరకు.. ఇలా వివిధ జీవక్రియల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే మన జీవనశైలిలో కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ అలవాట్లు చిన్నవే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాలేయం పనితీరుపై ప్రభావం చూపుతాయి. దీనిద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
‘ప్రపంచ కాలేయ దినోత్సవం’ సందర్భంగా కాలేయం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆ అలవాట్లేంటో తెలుసుకొని జాగ్రత్తపడదాం!
శరీరంలో జీవక్రియలకు సంబంధించిన విధులను కాలేయం నిర్వహిస్తుంది. మనం తీసుకునే ఆహారం కాలేయం పనితీరుపై ప్రభావం చూపుతుంది. అధిక షుగర్, వేపుడు పదార్థాలు, మద్యం, ప్రాసెస్ చేసిన మాంసం వంటి ఆహార పదార్థాలు అధికంగా తీసుకుంటే కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయం పాడవ్వడానికి ప్రధాన కారణం హెపటైటిస్. కాలేయానికి సంబంధించి చేసే స్టడీస్‌ను హెపటాలజీ, హెపాటిక్ అని అంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనదేశంలో ఎక్కువగా వచ్చేది హెపటైటిస్ ఎ, బి వైరస్.
కారణాలు..
ఆహారం తినేముందు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం. మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడగకపోవడం. కలుషిత ఆహారం తినడం, నీళ్లు తాగడం వల్ల హెపటైటిస్ ఎ, బి వ్యాధులు వస్తాయి. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది. అది ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్లి.. అక్కడి నుంచి కాలేయానికి చేరి ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతుంది. దాంతో లివర్ పనితీరు డ్యామేజ్ అవుతుంది.
రకాలు..
హెపటైటిస్‌లో ఎ, బి, సి, డి, ఇ అనే రకాలు ఉన్నాయి. ఎ, బి రకాలు కలుషిత ఆహారం, నీటి వల్ల వస్తుంది. దీన్ని హెపటైటిస్ అక్యూట్ డిసీజ్ అంటారు. దీన్ని వెంటనే కనుక్కోవచ్చు. హెపటైటిస్ రకంలో ఒక వ్యక్తి నుంచి వచ్చే ద్రవ (లిక్విడ్) పదార్థాల ద్వారా వస్తుంది. అంటే.. లాలాజలం, రక్త మార్పిడి, అన్ ప్రొటెక్టెడ్ సెక్స్ వంటి వాటివల్ల హెపటైటిస్ వైరస్ అటాక్ అవుతుంది. హెపటైటిస్ రకం క్రానిక్ డిసీజ్‌కు దారితీస్తుంది.
దీని బారిన పడ్డాక చాలాకాలానికి లక్షణాలు బయటపడతాయి. ఆ లక్షణాలను కనుక్కోవాలంటే ఒక్కో రకానికి ఒక్కో టైం ఉంటుంది. ఎ, బి రకాలైతే మూడు నుంచి ఐదు రోజుల్లోపు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలిక (క్రానిక్) రకాలను మాత్రం కొన్ని వారాల టైం పడుతుంది. కొందరిలో అయితే కొన్నేండ్ల వరకు కనుక్కోలేం. ఎందుకంటే అవి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా లివర్‌ని డ్యామేజ్ చేస్తుంటాయి.
70 శాతం మందికి..
ఈ వ్యాధి చాపకింద నీరులా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అసలు ఈ వ్యాధి ఉందని చాలామందికి తెలియదు. వ్యాధి ఉందని తెలిసేలోపు ‘లివర్’ తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురి అవుతుంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్‌ఫెక్షన్ బాగా ముదిరిన తర్వాతనే అసలు విషయం తెలుసుకుంటున్నారు. ఈ వైరస్‌ల కారణంగా దశల వారీగా కాలేయ వాపు, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది.
మంచినిద్ర..
ఆరోగ్యానికి సుఖ నిద్ర ఎంతో ముఖ్యం. అయితే ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఇతర కాణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది మంచినిద్రకు దూరమవుతున్నారు. ఫలితంగా కాలేయంపై ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా కాలేయం పనితీరు దెబ్బతింటుంది. అందుకే ప్రతిరోజు ఏడు గంటలు నిద్రకు సమయం కేటాయించడం మంచిదంటున్నారు నిపుణులు.
బ్రేక్‌ఫాస్ట్..
మన శరీరంలోని మలినాలు, విషపదార్థాల్ని బయటకు పంపించడంలో కాలేయం పాత్ర కీలకం. ఈ క్రమంలోనే కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం తప్పనిసరి. అయితే కొంతమంది సమయం లేదనో.. ఇతర కారణాల వల్లో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. కాని ఇది మంచిది కాదు. పోషకాలతో నిండిన ఓట్స్, పండ్లు, ఇడ్లీ, దోసె.. వంటి పదార్థాల్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాలి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
ప్రతి చిన్నదానికీ..
తలనొప్పి, జలుబు వచ్చినా సరే.. ట్యాబ్లెట్ వేసుకోవడం కొంతమందికి అలవాటు. కాని ఇలా ప్రతి చిన్న సమస్యకీ వేసుకునే మందులు కూడా కాలేయం పనితీరుని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు సూచించిన మందులు తగిన మోతాదులో వేసుకోవడమే ఉత్తమం.
ఇవి అందుతున్నాయా?
బి విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే ఇవి తగినంత మోతాదులో శరీరానికి అందుతున్నాయో? లేదో? సరిచూసుకొని అవసరమైతే ఆ పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ క్రమంలో గుడ్లు, చేపలు, చీజ్, రొయ్యలు.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి బి చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. వీళ్లు అవసరమైతే ఆహారంతో పాటు నిపుణుల సలహా మేరకు సప్లిమెంట్స్ కూడా వాడవచ్చు.
ప్రొటీన్లు ఎక్కువైతే?
మనం తీసుకునే ఆహారపదార్థాల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకే ప్రొటీన్లు మితంగానే తీసుకుంటూ.. కార్బోహైడ్రేట్స్ కూడా మోతాదుకు మించకుండా తీసుకోవడం ముఖ్యం.
ఇవి గుర్తుంచుకోవాలి..
మూత్రం వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఆపుకోకుండా వీలైనంత త్వరగా మూత్రవిసర్జన చేయాలి. ఫలితంగా శరీరంలోని మలినాలు త్వరగా బయటకు వెళ్లిపోయి కాలేయ పనితీరు బాగుంటుంది. అతిగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం.. వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే దీనివల్ల కూడా కాలేయం పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తపడాలి.
మనం తీసుకునే ఆహారపదార్థాల్లో చక్కెర అధిక మోతాదులో ఉన్నా కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి చక్కెర ఉన్న ఆహార పదార్థాల్ని మితంగా తీసుకోవడం మంచిది. శరీరానికి సరిపడినంత వ్యాయమం అందకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం.. వంటి కారణాలు కూడా కాలేయం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్ట ఈ విషయాల్లో జాగ్రత్తపడాలి.
డాక్టర్ కిషోర్ రెడ్డి వై, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ మెడికోవర్ హాస్పిటల్స్, హైదరాబాద్