19-04-2025 12:00:00 AM
హనుమకొండ, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హనుమకొండలోని ప్రముఖ చారిత్రక ప్రదేశం అగ్గలయ్య గుట్టను సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మన పూర్వీకుల కృషిని ప్రతిబింబించే వారసత్వ సంపదలను సంరక్షించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు అందించాలన్నది తన లక్ష్యం అన్నారు.
అందుకే కెసిఆర్ హయాంలో అగ్గలయ్య గుట్టకు చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి వందల ఏళ్లనాటి జైన విగ్రహాలు కలిగిన గుట్టను రూ.1.5 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. గతంలో మరుగునపడిన ఈ ప్రదేశాన్ని ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినందుకు సంతోషంగా ఉందని అన్నారు. తద్వారా అగ్గలయ్య చరిత్రకు గుర్తింపు లభించిందని అన్నారు.
అగ్గలయ్య పశ్చిమ చాళుక్యులు, కల్యాణి చాళుక్యుల కాలంలో సేవలందించిన ప్రాచీన వైద్య నిపుణులని ఆయన చేసిన వైద్య సేవలు, పరిశోధనలు మన ప్రాంత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అగ్గలయ్య గుట్ట అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు.
జైన సంప్రదాయానికి చెందిన ప్రాచీన జినాలయాలు, విద్యా కేంద్రాలు, వైద్య సేవలకు కేంద్రంగా ఈ ప్రాంతం ఉండేదని,అటువంటి చారిత్రక ప్రదేశాలను గుర్తించి తరతరాల పాటు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవాన్ని పురస్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు గండ్రకోట రాకేష్ యాదవ్, పబ్బోజు శ్రీకాంత్ చారి, మూటిక రాజు, బయ్య శోభన్, పులి అర్జున్, రవీందర్, హరికృష్ణ, కొండ బాబు, సమ్మయ్య, జబ్బర్ పాషా, సందీప్, తదితరులు పాల్గొన్నారు.