calender_icon.png 16 November, 2024 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాల విశిష్టతకు భంగం కలగకుండా పనులు

19-09-2024 02:12:49 AM

వేగవంతానికి వివిధ శాఖల సమన్వయం అవసరం 

మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగంగా వాటి ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ సూచించారు. కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి, యాదాద్రి దేవాలయంలో కొనసాగుతున్న పనుల్లో పురోగతి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పలు ఆలయాల్లో సౌకర్యాల కల్పనపై సచివాలయంలో మంత్రి సురేఖ సంబంధిత అధికారులతో బుధవారం సమీ క్ష నిర్వహించారు.

దేవాలయాల ప్రగతికి చేపట్టే పనులు వేగవంతంగా దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ నివేదిక ఇచ్చాక.. యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురం స్వర్ణతాపడం, వేదపాఠశాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. కంచీ కామకోఠి పీఠం ఆధ్వర్యంలో గోవిందహరి చైర్మన్‌గా రాయగిరిలో 20 ఎకరాల్లో రూ.43 కోట్ల అంచనా వ్యయంతో వేద పాఠశాలను నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇండియాలనే అతిపొడవైన లింక్ బ్రిడ్జ్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.

3నెలల్లో లింక్ బ్రిడ్జ్ పనులను పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రామప్ప దేవాలయం స్ఫూర్తితో కీసర రామలింగేశ్వర స్వామి దేవస్థానం, నాట్యమండపం, పరిసరాలను తీర్చిదిద్దాలన్నారు. కుల వృత్తులు, మహిళా సంఘాల సభ్యులకు దేవాదాయ శాఖ తరపున ఉపాధి కల్పించేలా చూడాలని, చేర్యాల నకాసీ చిత్రకళ, పోచంపల్లి చేనేత, పట్టు వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించాలన్నారు. రాముడు దక్షిణ భారతదేశంలో తిరగాడిన ప్రాంతాలను వివరిస్తూ డిజిటల్ మ్యూజి యం ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించగా మంత్రి ఆమోదం తెలిపారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు విషయమై మంత్రి సీతక్కతో చర్చిస్తానన్నారు.