- కేఎంపీఎల్రాకపోయినా చర్యలే
- నగదు టార్గెట్స్ పేరా వేధింపులు
- కామారెడ్డి డిపోలో డీఎం, సీఐల లీలలు
కామారెడ్డి, నవంబర్ ౬ (విజయక్రాంతి): ఆర్టీసీ సంస్థలో పనిచేసే కండక్టర్లు, డ్రైవర్లను కామారెడ్డి డిపో మేనేజర్, సీఐ వేధింపులకు గురిచేస్తున్నారు. డిపోలో ఖాళీలు ఖాళీలుగానే ఉండగా విధులు నిర్వహించే వారికి డబుల్ డ్యూటీ వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. కేఎంపీఎల్ పేరిట, టార్గెట్ మేరకు నగదు ఆదాయం తేలేదంటూ వేసిన డ్యూటీ చేయలేదని చిన్న చిన్న కారాణాలు చూపి ఇంక్రిమెంట్లలో కోత విధిస్తున్నారు.
కొందరని సస్పెండ్ చేస్తున్నారు. రిమూవల్ వంటి పనిష్మెంట్లకు డీఎం గురి చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు తమ గోసను కామారెడ్డి జేఏసీ నాయకులను విన్నవించడంతో వారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు . దీంతో డీఎం, సీఐలపై ఫిర్యాదు చేసిన వారిని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.
విజిలెన్స్ విచారణలో వాస్తవాలు!
గతకొన్ని రోజులుగా కొంతమంది కార్మికుల పట్ల డ్యూటీలు వేయడంలో పక్షపతంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ నాయకులు విజిలెన్స్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. సీఐ ద్వారా డీఎంకు తన హకూంను జారీ చేస్తూ కార్యాలయానికి అవసరమైన సామగ్రిని కొని తెప్పించుకుంటు న్నట్లు విచారణలో కొంతమంది కార్మికులు వివరించినట్లు తెలుస్తుంది.
ఓ కార్మికుడు తాను చెప్పినట్లుగా చేయనందుకు రిటైర్డ్‌మెంట్ ఫంక్షన్ కూడా చేయలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. డీఎం, సీఐలు చెప్పినట్లు వినని కార్మికుల పట్ల పక్షవాత ధోరణిని అవలంభిస్తు కష్టమైన రూట్లలో డ్యూటీలు వేస్తున్నారని చెప్పినట్టు తెలుస్తున్నది. ఫోన్‌పే, గూగుల్ పేల ద్వారా కార్మికుల నుంచి సీఐ, ఇతర అధికారులు డబ్బులు వసూళ్లు చేసినట్లుగా వివరాలను విజిలెన్స్ అధికారులకు జేఏసీ నాయకులు ఆధారాలను అందజేసినట్లు తెలుస్తుంది.
కార్మికులతో గేట్ మీటింగ్‌లు
కామారెడ్డి డీఎం తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు డిపో ఆవరణలోనే గేట్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి, కార్మికులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. తాను చేసిన తప్పులు సరిదిద్దుకుంటానని, కార్మికులు గుర్తించి పద్ధతి మార్చుకోవాలని హితవు పలుకుతున్నట్లు సమాచారం. కాగా డిపోలో రెండు వర్గాలు చేసి తమకు అనుకూలమైన వర్గాన్ని ఏర్పర్చుకొని ఎన్ని తప్పులు చేసిన మాఫీ జరుగుతుందనే భావనలో డీఎం, సీఐలు ఉన్నట్లు తెలుస్తుంది.
వారికి అనుకూలంగా వ్యవ హరిస్తున్న కార్మికులు వారికి నచ్చజెప్పుతూ ఎవరైన అధికారులకు వ్యతి రేకంగా విజిలెన్స్ విచారణలో చెప్పినట్లయితే భవిష్యత్‌లో వారికి తగిన పనిష్మెం ట్లు ఉంటాయని పరోక్షంగా కొందరు కార్మికులు చెబుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు స్పం దించి డీఎం, సీఐలకు సెలవు ఇచ్చి విజిలెన్స్ విచారణ సజావుగా సాగేలా చూడాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు.