calender_icon.png 30 November, 2024 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గెస్ట్’లతో వెట్టిచాకిరీ!

30-11-2024 12:27:14 AM

  1. అతిథి అధ్యాపకులకు పెరుగుతున్న పని భారం 
  2. విధుల్లోంచి తొలగించి.. ఆపై వేతనంలో కోత 
  3. శ్రమదోపిడీకి పాల్పడుతున్న గురుకుల సొసైటీలు! 
  4. నెల జీతం ఇవ్వాలంటున్న సంఘం నాయకులు 

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): గెస్ట్ ఫ్యాకల్టీ దుస్థితి రోజురోజుకూ అయోమయంలోకి వెళ్తున్నది. ఎస్సీ గురుకులాల్లో తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయ, అధ్యాపకులకు సంబంధించి సెప్టెంబర్ జీతంలో కోతలు విధించడంతో వారిలో ఆందోళన మొదలైంది.

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీని యాజమాన్యం సెప్టెంబర్ 2న ఉన్న ఫలంగా విధుల నుంచి తొలగించింది. దీంతో దాదాపు 4వేల మంది ఆందోళన చేపట్టడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు మూడు రోజుల తరువాత (సెప్టెంబర్ 4న మధ్యాహ్నం) వారిని విధుల్లోకి తీసుకున్నారు.

అయితే విధుల్లో లేని ఆ రెండున్నర రోజుల వేతనానికి కోత పెట్టేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ సొసైటీల్లో విధులు నిర్వర్తిస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ ప్రతి నెలా 100 క్లాసులు చెప్పాల్సి ఉండగా.. ప్రస్తుతం 120 నుంచి 140 పీరియడ్స్ చెప్పే పరిస్థితి నెలకొన్నది.

రెగ్యులర్ వారితో సమానంగా క్లాస్‌లు చెప్పడంతోపాటు నైట్, స్టడీ, హాలిడే డ్యూటీలు చేస్తున్నారు. అయితే సొసైటీలు గెస్ట్ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా 100 క్లాసులు చెబితే పూర్తి వేతనం చెల్లించాల్సి ఉండగా.. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ మాత్రం మూడు రోజులు విధులకు హాజరు కాలేదన్న సాకుతో వేతనంలో కోత పెట్టడం సరికాదని వారు వాపోతున్నారు. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

సొసైటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వేతనాల్లో కోత విధిం చడం జరుగుతుంది. సెప్టెంబర్ 2, 3 తేదీలతోపాటు 4న మధ్యాహ్నం వరకు గెస్ట్ ఫ్యాకల్టీ విధులకు హాజరు కాలేదు. సొసైటీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 4న మధ్యాహ్నం తాత్కాలిక పద్ధతిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఆ రెండున్నర రోజులకు సంబంధించిన వేతనాన్ని మాత్రమే ఆపడం జరుగుతుంది. 

 అరుణకుమారి, జోనల్ అధికారి

వేతనాల్లో కోత విధించొద్దు

యాజమాన్యం పార్ట్ టైం ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సెప్టెంబర్ నెల పూర్తి వేతనం చెల్లించాలి. భద్రత లేని ఉద్యోగం చేస్తూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. యాజమాన్యం నిర్ణయం మేరకే మూడు రోజులు విధులకు వెళ్లలేదు. ప్రభుత్వం స్పందించి గెస్ట్ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

యు.శరణప్ప, పార్ట్ టైం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు