calender_icon.png 19 October, 2024 | 10:00 PM

ధనుష్‌తో పనిచేయడం అంత సులువు కాదు

25-07-2024 12:05:00 AM

ప్రస్తుతం త్రినాధరావు దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్న సందీప్ కిషన్, సైన్స్ ఫిక్షన్ చిత్రమైన ‘మాయావన్’తో పాటు ‘వైబ్’ అనే మరో చిత్రంలోనూ కథానాయకుడిగా కనపడనున్నారు. కథలు బాగున్న కారణంగా కొన్ని పాత్రలు చేయడం తప్పితే.. హీరోగా నటించేందుకే తన ప్రాధాన్యత అని స్పష్టతనిచ్చిన ఆయన, ఆ కోవలో చేసిందే ఈ సినిమా అంటూ ‘రాయన్’ విశేషాలను చెప్పుకొచ్చారు. జూలై 26న తెరమీదికి రానున్న ఈ సినిమా కోసం పాత్రికేయులతో సమావేశమైన సందీప్ పంచుకున్న కొన్ని సంగతులు..

ఇప్పటికే కొన్ని తమిళ సినిమాలు చేశారు.. రాయన్ మీకు ఏ విధంగా ప్రత్యేకం?

ఇప్పటివరకు నాకు నచ్చిన కథలు, దర్శకులతో కొన్ని తమిళ సినిమాలు చేశాను. ధనుష్ 50వ సినిమా కావడంతో పాటు, కథని ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. ధనుష్‌తో ‘కెప్టన్ మిల్లర్’ చేసినప్పటికీ.. ‘రాయన్’ నేపథ్యం పూర్తిగా వేరు. నా పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే చాలా ప్రాధాన్యత ఉంది. ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయి. ఇప్పటివరకూ నేను చేయని ఈ పాత్ర కథతోపాటు సీరియస్‌గా సాగుతూనే.. చూసేవారికి వినోదాన్ని పంచుతుంది. ధనుష్ తన కోసం రాసుకుని, నాకు ఇచ్చారు. నటన, పాత్రల పరంగా నా కెరీర్‌లోనే గుర్తుండిపోయే సినిమా ఇది.

ట్రైలర్ చూస్తుంటే కుటుంబ కథలా అనిపిస్తోంది..? 

అవును. ధనుష్ పెద్దన్నగా కనపడనుండగా నేను రెండో వాడిని. మూడో వాడు కాళిదాస్, మాకో చెల్లి (దుషారా). -మా ఈ కుటుంబ కథేమిటన్నది తెరపైనే చూడాలి. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్‌తోపాటు భావోద్వేగాలు కూడా మెప్పిస్తాయి.

నటుడిగా, దర్శకుడిగా ధనుష్ గారితో పనిచేయడం గురించి..?

ఇది అరుదైన అవకాశం. ధనుష్ దర్శకత్వంలో పనిచేయడం అంత సులువు కాదు. దర్శకుడిగా ఆయనతో పనిచేసినపుడు కృష్ణవంశీ, దేవాకట్టా, రాజ్ డీకేలు గుర్తొచ్చారు. ఈ సినిమాలోని నటులందరూ ఆయన విజన్‌కి తగ్గట్టుగా పనిచేశారు. తొంబై రోజుల చిత్రీకరణలో నేను 75 రోజులు చేశా. ఓ పోరాట సన్నివేశంలో భుజానికి గాయం కూడా అయ్యింది. నటుడిగా చాలా టేక్స్ తీసుకున్నా. అయితే ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్ వంటి వారిదీ అదే పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 

టైటిల్ రాయన్ అని పెట్టడానికి కారణం?

-సినిమాలో మా ఇంటి పేరు అది. తెలుగులో ఇది మార్చగలరేమో అని ధనుష్ గారిని అడిగితే.. కథ ప్రామాణికత కారణంగా అలా చేయకూడదన్నారు. దీనిని డబ్బింగ్ సినిమాగా చూస్తేనే బావుంటుందని చెప్పారు.

ఈ సినిమా ద్వారా రెహమాన్ స్వరకల్పనలో తనకు ఓ పాట దొరికినందుకు ఆనందంగా ఉందన్న సందీప్, ‘రాయన్’లో తనకి బాగా ఇష్టమైన ‘పీచు మిఠాయి’ పాట.. విడుదల తర్వాత చాలామందికి చేరువవుతుందన్నారు. హీరోగా తనకి ఇటీవల మంచి విజయాన్ని అందించిన ‘భైరవకోన’ సినిమాకి స్వీక్వెల్ ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, నిర్మాతగా           వెంకటాద్రి టాకీస్‌లో ఇకపై ఇతరులతో సినిమాలు చేస్తానం టూ.. త్వరలో ఓ కొత్త సినిమా వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.