calender_icon.png 8 October, 2024 | 10:13 AM

మదర్ డెయిరీ అభివృద్ధికి కృషి

08-10-2024 02:33:43 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అట్టహాసంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

ఎల్బీనగర్, అక్టోబర్ 7: సమన్వయంతో పనిచేస్తేనే అధిక లాభాలు సాధ్యమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయంలో సోమవారం పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్న మదర్ డెయిరీని కాపాడుకోవడంతో పాటు లాభాల్లోకి తీసుకునిరావాల్సిన బాధ్యత పాలక వర్గంతోపాటు ఉద్యోగులపై ఉందన్నారు. పాలకమండలి, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మదర్ డెయిరీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. లక్షలాది రైతులు డెయిరీపై ఆధారపడ్డారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని పాలకవర్గానికి సూచించారు. తెలంగాణలోని ఆలయాలు, విద్యాసంస్థలు, గురుకులాలకు మదర్‌డెయిరీ పాలు, నెయ్యి ఉత్పత్తులను విక్రయించేలా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చా రు.

ఆలేరు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడు తూ.. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మదర్‌డెయిరీకి ఉన్న ఆస్తులు, అప్పులు, సమస్య లు, డెయిరీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముసాయిదా రూపొందించాలన్నారు.

నష్టాల్లో ఉన్న డెయిరీకి పూర్వ వైభవం తేవాలని సూచించారు. దాదాపు రూ.1500 కోట్ల విలువైన స్థిరాస్థి ఉన్న హయత్‌నగర్ మదర్‌డైయిరీ ప్రాంగాణాన్ని పూర్తిస్థాయిలో విని యోగించడానికి చేపట్టాల్సిన అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. 

బాధ్యతల స్వీకరణ..

మదర్ డెయిరీ చైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్లుగా కర్నాటి జయ శ్రీ, చల్లా సురేందర్‌రెడ్డి, రచ్చలక్ష్మినర్సింహారెడ్డి, కోట్ల జలంధర్‌రెడ్డి, కందాల అలివేలు, గూడూరు శ్రీధర్‌రెడ్డి, కస్తూరి పాండు, గొల్లపల్లి రాంరెడ్డి, మందడి ప్రభాకర్‌రెడ్డి, కల్లేపల్లి జంగయ్య, అగ్రాల నర్సింహారెడ్డి, బత్తుల సురేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్ కాంగ్రెస్ నేత రామ్మోహన్‌గౌడ్, పాల ఉత్పత్తిదారుల సంఘాల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.