17-03-2025 02:09:06 AM
మందమర్రి, మార్చి 16 : వేసవిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి ఉపరితలంలో పనిచేస్తున్న కార్మికుల సౌకర్యార్థం వేసవి ఉపశమన చర్యలు చేపట్టి పనివేళలు మార్చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి అల్లి రాజేందర్ లు డిమాండ్ చేశారు. రామకృష్ణపూర్ లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
అన్ని గనులు డిపార్ట్మెంట్లలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ లు వాటర్ రిఫ్రిజిరేటర్ లను మరమ్మతులు నిర్వహించి అందుబాటులోకి తీసుక రావాలని వారు కోరారు. వేసవి ఉపశమన చర్యలు చేపట్టి పని సమయ వేళలను గుర్తింపు సంఘం మార్పించాలని డిమాండ్ చేశారు. ఓసిపి, సిహెచ్పి, వర్క్ షాప్, సివిల్ లలో అవుట్ డోర్ లో పనిచేసే కార్మికులకు, గనుల పైన ఎండలో పని చేసే ప్రతి ఒక కార్మికునికి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలన్నారు.
ఆఫీసులలో ఎండకు కంప్యూటర్లు మొరాయించే పరిస్థితి ఉన్నందున యాజమాన్యం ఏసీల ఏర్పాటుపై దృష్టి సారించా లన్నారు. గుర్తింపు సంఘం గత మూడు నెలలుగా ఏరియాలో పాల్గొన్న స్ట్రక్చర్ సమావేశాల్లో పరిష్కరించిన సమస్యలను కార్మికులకు తెలియజేయాలన్నారు.
చైర్మన్ స్థాయిలో జరిగిన సమావేశం లో కోల్ ఇండియాలో అమలవుతూ సింగరేణిలో అధికారులకు అమలవుతున్న అలవెన్సులపై ఐటి మాఫీ ఒప్పందాన్ని అమలు చేయించ లేకపోయారని వారు విమర్శించారు. ఎన్నికల హామీగా ఇచ్చిన 20 లక్షల రుణాన్ని అమలు చేయించలేక పోయారని వారు గుర్తింపు సంఘంపై తీవ్రంగా మండిపడ్డారు.
కష్ట పడి పని చేసే వారిని కాకుండా నిరంతరం ఉచిత మస్టర్లు పడిపోయే వారిని గనులలోకి పంపించి చైర్మన్ ఆదేశాలను అమలు చేయాలని, యాజమాన్యం ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, ఆలువాల సంజీవ్, ఆర్గనైజర్ ఆదర్శ్, శ్రీకాంత్, శ్రీధర్, లింగాల రమేష్ లు పాల్గొన్నారు.