రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
పాలేరు జలాశయంలో చేప పిల్లల విడుదల
ఖమ్మం, అక్టోబర్ 8 (విజయక్రాంతి)/కూసుమంచి: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, మత్స్యకార్మికులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు రెవె న్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కూసుమంచి మండలంలో ఆయన పర్యటించారు.
ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి పాలేరు జలాశయంలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగడా పొంగులేటి మాట్లాడుతూ.. జలాశయం సామర్థ్యం మేర మరో 5 లక్షల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యకారులు కోరారని, వారి విజ్ఞప్తి మేరకు చేప పిల్లలు విడుదల చేస్తామని చెప్పారు.
సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలు చెల్లించిన రివాల్వింగ్ ఫండ్ విడుదలయ్యేలా చూస్తానని అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం అందించామని, నదీ ప్రవాహం సమీపంలో ఉన్న ప్రజలకు మరో చోట ఇల్లు కట్టుకునేందుకు స్థలం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పాలేరు జలాశయంలో 7 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో గణేశ్, మత్స్యశాఖ ఉప సంచాలకుడు ఆర్.లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి జిల్లా మత్స్య శాఖాధికారి శివప్రసాద్, తహసీల్దార్ సురేశ్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా కూసుమంచి మండల కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 84 మం దికి రూ.26,58,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. 40 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బేబీ స్వర్ణకుమారి పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న పొంగులేటి
తిరుమలాయపాలెం పర్యటనను ముగించుకుని మంగళవారం సాయంత్రం ఖమ్మంలోని క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బయలుదేరారు. ఈ క్రమంలో కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గమనించిన మంత్రి తన కాన్వాయ్‌ను ఆపి క్షతగాత్రుడి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రుడిని కిమ్స్ ఆస్పత్రికి తరలిం చాలని ట్రాఫిక్ సీఐని ఆదేశించడమే కాకుండా ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కారుతో పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం క్షతగాత్రుడి పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.