బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పలు కార్మిక కాలనీలకు సింగరేణి విద్యుత్(Singareni Electricity) కనెక్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాత జిఎం కార్యాలయం వద్ద కన్నాల బస్తి, టేకుల బస్తికి చెందిన కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. సింగరేణి(Singareni) కంపెనీలో పనిచేసి కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడిన తమ కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులు సృష్టించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ కార్మికుల కుటుంబాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారి పేరిట ఉన్న కంపెనీ క్వార్టర్లకు విద్యుత్ పునరుద్ధరించాలని విద్యుత్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొట్ల సురేష్ తో పాటు రిటైర్డ్ కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.