19-04-2025 09:14:51 PM
మంచిర్యాల (విజయక్రాంతి): సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని బీఎంఎస్ సెంట్రల్ నాయకులు, ఏబీకేఎంఎస్ కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు మాధవ నాయక్ కోరారు. శనివారం సింగరేణి భవన్‌లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్ కి 1992లో జెబిసిసి ఐతో యాజమాన్యం చేసుకున్న ఎం ఓ యు ప్రకారం కొత్తగా చేరిన వారందరికీ కూడా ఐడి కార్డులు జారీ చేయాలని వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఒడిశాలో నైని బొగ్గు గని ప్రారంభం కావడం వల్ల సింగరేణికి వచ్చే 34 సంవత్సరాల బలమైన భవిష్యత్తు ఏర్పడిందన్నారు. ఈ గనిలో 340 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, ప్రతి సంవత్సరం దాదాపు 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. ఈ గనిని కేంద్ర ప్రభుత్వం 2015లో కేటాయించినప్పటికీ, గత ఒడిశా ప్రభుత్వం భూమి సేకరణ, పర్యావరణ అనుమతుల్లో ఆలస్యం చేయడం వల్ల ప్రారంభం కావడంలో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు.
ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఈ గని ప్రారంభమయ్యిందన్నారు. సిఎండి బలరాం నాయక్ సమన్వయంతో కేంద్ర, రాష్ట్రాల నుంచి అవసరమైన అనుమతులు సాధించి, అత్యంత వేగంగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం చారిత్రాత్మక విషయమని పేర్కొన్నారు. ఈయన వెంట బి.ఎం.ఎస్ కార్పొరేట్ ఏరియా ఉపాధ్యక్షులు జీవీ కృష్ణారెడ్డి, కార్యదర్శి ఉట్ల గణేష్, శ్యామ్ లాల్ తదితరులు ఉన్నారు.