02-04-2025 12:21:37 AM
ఫ్యాక్టరీ వద్ద కార్మికుల నిరసన
మనోహరబాద్ ఏప్రిల్ 1: పరిశ్రమలో విద్యుత్ షాక్ గురై కార్మికుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని శ్రేయాన్ పాలిమర్ పరిశ్రమలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరిశ్రమలో గత ఆరు నెలల నుండి మధ్యప్రదేశ్ కు చెందిన రఘునాథ్ (21) అనే కార్మికుడు విధులు నిర్వహిస్తున్నాడు.
రోజువారీ గానే మంగళవారం ఉదయం పరిశ్రమలో ఇంజక్షన్ మోల్ మిషన్ వద్ద పనిచేస్తున్న తరుణంలో కూలర్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ తగిలి గాయాల పాలయ్యాడు. ఇది గమనించిన తోటి కార్మికులతో పాటు సోదరుడు దినేష్ మేడ్చల్ లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే ఆ కార్మికుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పరిశ్రమలో ఆపరేటర్ గురువకృష్ణ, ఇన్చార్జి మోతుకు రవిలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, తన సోదరుడు మృతి చెందినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సహోదరుడు మృతికి కారమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
ఈ సంఘటన జరగడంతో పరిశ్రమలో ఉన్న కార్మికులంతా బయటకు వచ్చి పరిశ్రమ ముందు నిరసన తెలిపారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్త్స్ర సుభాష్ గౌడ్ తెలిపారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు. అలాగే ఈ పరిశ్రమలో ఎలాంటి సేఫ్టీ సౌకర్యాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పరిశ్రమలో తనిఖీలు చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.