calender_icon.png 13 February, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రం పనులపై స్టే

13-02-2025 02:24:31 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మండలం ప్యారానగర్‌లో మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం పనులపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. అనుమతుల్లేకుండా ఈ కేంద్రం పనులను చేపట్టరాదని పేర్కొంది. అయితే సర్వే నిర్వహించుకోవడానికి, రోడ్డు నిర్మాణం పనులను కొనసాగించవచ్చని చెప్పింది.

ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. ప్యారానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటును సవాలు చేస్తూ స్వర్ణలత అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌తో పాటు పలువురు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూముల్లో పనులు జరుగుతున్నాయన్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి అవతల చెత్త శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఇదే హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ అటవీశాఖ అనుమతులు తీసుకొని రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమి ఒక్క అంగుళం కూడా వద్దని, ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి గురువారం నుంచి సర్వే నిర్వహిస్తున్నామన్నారు.

కేసును కొట్టివేయండి : హైకోర్టులో సునీతా లక్ష్మారెడ్డి పిటిషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మెదక్ జిల్లా ఎల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్‌ఎస్ నేత, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్దుర్తి అంబేద్కర్ క్రాస్ రోడ్డు వద్ద అనుమతి లేకుండా నిరసన కార్యక్రమంపై పోలీసులు 2018లో పోలీసులు నమోదు చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడమేకాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది.

ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న ఈ కేసును కొట్టివేయాలంటూ సునీతా లక్ష్మారెడ్డితోపాటు నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అయితే ఇందులో ఫిర్యాదుదారును ప్రతివాదిగా చేర్చడానికి పిటిషనర్లకు అనుమతిస్తూ విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.