అన్వేష్ ఐదవ తరగతి చదువుతున్నాడు. చాలా తెలివి కలవాడు. పాఠాల్లోని ప్రశ్నలే కాదు, జనరల్ విషయాలు అడిగినా టకటకా సమాధానాలు చెప్పేస్తాడు. ప్రస్తుతం స్కూళ్ళలో అనుభవిస్తున్న బండెడు హోం వర్కు బాధితుల్లో వాడూ ఉన్నాడు. వేసవి సెలవుల్లో అన్వేష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లాడు. అక్కడ పూర్వపు రాజుల పాడుపడిన కోట ఉన్నది. ఖాళీగా ఉండటం మూలాన పిల్లలు సాయంకాలాలు అక్కడ ఆడుకుంటుంటారు.
ఒకరోజు సాయంత్రం ఆడుకుంటుండగా మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అన్వేష్ దగ్గరకెళ్ళి పరీక్షగా చూశాడు. అదొక పాతకాలపు నాణెం. ఏ రాజుల కాలం నాటిదో ఇంటికెళ్ళి మామయ్యనడగాలి అనుకున్నాడు. ఆ నాణేన్ని జేబులో వేసుకొని మళ్ళీ మామూలుగా స్నేహితులతో ఆడుకున్నాడు.
అన్వేష్ ఇంటికొచ్చి ఆ నాణేన్ని బాగా రుద్ది రుద్ది కడిగాడు. దానికున్న చిలుం అంతా పోయి మెరుస్తుంది అని చూసుకుంటూ ఉండగా ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడ్డ ఒక భూతం కనిపిస్తుంది. అల్లావుద్ధిన్ అద్భుతదీపంలోని భూతంలా ఉన్నది. ఆ కథలు చదివి ఉండటం వల్ల అన్వేష్ భయపడకుండా “ఏమిటి ఇలా వచ్చావు?” అన్నాడు.
“నేను మీ సేవకుడిని బాబూ! మీకే పని కావాలన్న నిమిషాలలో చేసి పెడతాను. కానీ నీవు నాకు ఏ పనీ చెప్పకపోతే మాత్రం నిన్ను మింగేస్తాను. నాకు పని చెప్పినంతకాలం నిన్నేమీ చేయను. నాకు ఎప్పటికీ పనులు చెపుతూనే ఉండాలి, చెప్పు బాబూ!” అన్నది భూతం.
అన్వేష్ ఆలోచనలో పడ్డాడు. ‘ఎలాగైనా దీనితో పనిచేయించుకోవాలి. అంతేకాక కావాల్సినవన్నీ ఇస్తానంటోంది’ అనుకొని, “నాకొక బస్తా చాక్లెట్లు కావాలి” అన్నాడు. అంతే ఒక్కనిమిషంలో మాయమై బస్తా, చాక్లెట్లతో తిరిగొచ్చింది. అన్వేష్ ఆనందానికి హద్దు లేదు. గబగబా రెండు చాక్లెట్లు చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే భూతం “నాకేదన్నా పని చెప్పు బాబూ” అంటూ గుర్తు చేసింది.
“నాకు పెద్ద బుట్టెడు లాలిపాప్‌లు కావాలి” అన్నాడు అన్వేష్. హమ్మయ్య అంతలో ఈ చాక్లెట్లు తిందాం అనుకొని చాక్లెట్ కాగితాలు విప్పాడో లేదో లాలిపాప్ లతో ప్రత్యక్షమైంది భూతం. కాగితం విప్పిన చాక్లెట్ నోట్లో వేసుకోబోయేంతలో భూతం మరలా ముందుకొచ్చి, “నాకేదైనా పని చెప్పు బాబూ” అన్నది.
ఈ సారి వెంటనే అన్వేష్ “నాకు వంద కిలోల ఐస్ క్రీమ్ ప్యాక్‌లు కావాలి” అని చెప్పాడు. అలాగే అంటూ మాయమై మరుక్షణంలో ఐస్ క్రీము ప్యాకెట్లతో ప్రత్యక్షమైంది భూతం. ఇంకా చాక్లెట్ తిననే లేదు అన్వేష్. వీటన్నింటినీ చూసి చాలా ఆనందపడిపోయాడు అన్వేష్. వాటినన్నింటినీ పరమానందభరితంగా చూస్తుండగానే, “బాబూ! నాకేదైనా పని చెప్పు” అంటూ తొందరగా పెట్టింది భూతం.
తినేవి ఇంక చాల్లే, “నాకు ఆడుకోవటానికి బొమ్మలు కావాలి కాసిని కూసిని కాదు లారీ నిండా కావాలి” అన్నాడు అన్వేష్ భూతంతో.
లారీ నిండా బొమ్మలతో సహా వచ్చి ఇంటిముందు ఆగింది లారీ. వాటిలో ఉన్న స్పైడర్ మాన్, సూపర్ మాన్ లాంటి బొమ్మలు, విమనాలు, హెలికాప్టర్లు ఒకటేమిటి బజార్లో దొరికే అన్ని బొమ్మలు ఉన్నాయి. అన్వేష్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వాటినలా చూస్తుండగానే భూతం మరలా అన్వేష్ భుజం తట్టి, “బాబూ! నాక్దునా పని చెప్పు” అన్నది. అన్వేష్‌కు కోపం వచ్చింది “ఏంటీ నేను బొమ్మలతో ఆడుకోవద్దా! అలా పని పని అని విసిగిస్తావేమిటి” అన్నాడు కాస్తంత చిరాగ్గా.
కానీ భూతం అదేమి వినిపించుకోకుండా, “బాబూ! నాకేదైనా పని చెప్పు” అని పదే పదే అడుగుతోంది. “అయ్యో ఇదేంటి ఇలా వెంటబడుతోంది?” అని తనక్కావలసిన వస్తువులన్నీ తెమ్మని ఒకటొకటిగా చెప్పసాగాడు. చెప్పిన మరునిమిషంలో భూతం వాటన్నిటినీ తెచ్చేస్తోంది. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ తెచ్చేసింది. “నీ దగ్గర పనేమి లేకపోతే నిన్ను మింగేస్తా” అంటూ ముందుకొచ్చింది భూతం.
‘దీనితో పెద్ద చిక్కొచ్చి పడిందే. ఎలాగైనా తెలివిగా ఆలోచించి దీనితో పని చెయించుకోవాలి’ అనుకున్నాడు అన్వేష్.
‘ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తోంది. ఎప్పటికీ తరగని పని పెట్టాలి ఎలా?’ అని తీవ్రంగా ఆలోచించగా ఒక ఐడియా వచ్చింది. వెంటనే హుషారుగా భూతాన్ని పిలిచి, “నేను నీకొక పని చెప్తాను ఆ పని అయ్యేదాకా నా జోలికి రాకూడదు” అన్నాడు.
“ఓ అలాగే! అంది భూతం.
“రేపట్నుంచి నా హోమ్ వర్కంతా నువ్వే చేయాలి. మొత్తం అయిపోయేదాకా కదలకూడదు. అది అయిపోకముందే లేచి నాకేదైనా పని చెప్పు అని అడగకూడదు సరేనా” అన్నాడు అన్వేష్. “సరే” అంటూ భూతం హోమ్ వర్కు చేయడం మొదలు పెట్టింది. అన్వేష్ హాయిగా ఆడుకుంటున్నాడు. నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు గడుస్తున్నాయి. హోమ్ వర్కు పూర్తి కాలేదు. అది చెమటలు కార్చుకుంటూ ఇప్పటికీ చేస్తూనే ఉంది. సంవత్సరాలు గడిచి పోతున్నాయి. భూతానికి మాత్రం విముక్తి దొరకలేదు.
డాక్టర్ కందేపి రాణీప్రసాద్