కాలుష్య తీవ్రత దృష్ట్యా ఢిల్లీ సర్కార్ నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబర్ 20: కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ పర్యవరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో గాలి నాణ్యత 422గా నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఈ సూచి 500 మార్క్‌ను దాటింది. ఢిల్లీని దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాలుష్యం నేపథ్యంలో సుప్రీం కోర్టులోని ఏ కోసులైనా సరే లాయర్లు వర్చువల్ విధానంలో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు.