రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి బాధ్యతలు
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): రాష్ట్రానికి చెందిన క్రీడాకారుల సంక్షేమానికి కృషి చేస్తానని, అలాగే స్పోర్ట్స్ అథారిటీ గౌరవ ప్రతిష్ఠలు పెంచేందుకు శాయశక్తులా పనిచేస్తానని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె.శివసేనారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. పెద్దల సలహాలు, సూచనలతో క్రీడారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
క్రీడల్లో యువత భాగస్వామ్యం పెంచుతానన్నారు. ఆరోగ్యకరమైన క్రీడా వాతావరణం నెలకొల్పే దిశగా ముం దుకెళ్తానన్నారు. అనంతరం స్టేడియంలో హరితహారం మొక్కలు నాటారు. ఆయనకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.