calender_icon.png 10 October, 2024 | 12:50 PM

జోగుళాంబ ఆలయ అభివృద్ధికి కృషి

09-10-2024 12:00:00 AM

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 

ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ 

గద్వాల (వనపర్తి), అక్టోబర్ 8 (విజయక్రాంతి): అలంపూర్‌లో వెలిసిన జోగుళాం బ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మంత్రి కొండా ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఆలయాల సమీపంలో కేంద్ర నిధులతో నిర్మించిన ప్రసాద్ పథకం భవనాన్ని పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పర్యాటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలిసి హరిత టూరిజంలో మీడియాతో మాట్లాడారు. 5వ శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.

ముఖ్యమంత్రితో మాట్లాడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో ఆలయాలు నిరాధారణకు గురయ్యాయని విమర్శించారు. కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో ఏకో టూరిజం, పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఆలయాలకు వచ్చే భక్తులకు మజ్జిగ, పాలు, పిల్లలకు బాలామృతం అందివ్వాలని దేవదాయ శాఖ అధికారులకు సూచించారు. ఆమెవెంట ఆలయ నిర్వహణాధికారులు పురేందర్‌కుమార్ ఉన్నారు.

చేనేత వస్త్రాలను వాడాలి 

అలంపూర్, అక్టోబర్ 8: ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు వాడాలని, దాని ద్వారా నేతన్నలకు ఉపాధి దొరుకుతుందని, మన సంస్కృత్రి సంప్రదాయాలను కాపాడిన వారం అవుతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి గ్రామంలో చేనేత కార్మికులు మగ్గంపై నేసే చీరలను పరిశీలించారు. గద్వాల చేనేత పట్టు చీరలు నేయడంలో రాజోలి నేతన్నల కష్టం ఉన్నదన్నారు. అనంతరం కొన్ని వస్త్రాలను కొనుగోలు చేశారు.