- నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్మల్ ఉత్సవాలు
- చారిత్రక వారసత్వం, కళా సంపదలకు నెలవు
- కోటలు, గొలుసు చెరువుల ప్రత్యేకతలు
- కొయ్యబొమ్మలు, ఆదివాసీ సంప్రదాయాల పుట్టినిల్లు
- పోరాట స్ఫూర్తిని నింపే వెయ్యి ఉరుల మర్రి
- తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిర్మల్ జిల్లా
నిర్మల్, జనవరి 4(విజయక్రాంతి): అంగరంగ వైభవంగా ‘నిర్మల్ ఉత్సవాలు-2025’ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో అక్కడి స్థానిక చారిత్రక వైభవాన్ని అనుసరించి ఉత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అదే విధం గా నిర్మల్ పట్టణంలోనూ ఈ ఉత్సవాలు నిర్వహించడంతో ఎనలేని ప్రాధాన్యం నెలకొంది. ఏ జిల్లాకు లేని విధంగా ఎన్నో ప్రత్యేకతలు నిర్మల్ సొంతమనే చెప్పాలి. చారిత్రక వారసత్వంతో పాటు ఆదివాసీ సంప్రదాయాలు, పోరాటాలు, కళలు, వింతలు, విశేషాలు నిర్మల్ జిల్లా ప్రత్యేకతను చాటాయి.
శివాజీ నుంచి నిజాం వరకు..
నిర్మల్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నో ఏండ్లుగా పోరాటాలకు కేంద్ర బిందువు. 16వ శతాబ్దంలో మరాఠా ప్రాంతానికి చెందిన ఛత్రపతి శివాజీ హిం దూ సామ్రాజ్య స్థాపనలో మొదలైన చరిత్ర నిర్మల్ జిల్లా సాధించే వరకు పోరాట ప్రతిమను చాటుతూ సాగింది. అనాటి నిజాం నవాబులు నిరంకుశ పాలన, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నిర్మల్ కేంద్రంగా రాంజీగోండు చేసిన గెరిల్లా పోరాటాన్ని మరిచిపోలేం.
ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం రాంజీ గోండు అప్పటి బ్రిటిస్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించారు. 1857లో దేశంలో పలు ప్రాంతా ల్లో సిపాయిల తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే నిజాం, బ్రిటీష్ వారిపై రాంజీగోండు తిరుగుబావుటా ఎగురవేయడం ఈ ప్రాంత పోరాట పటిమను చాటుతుంది.
రాంజీగోండుతో పోరు చేయలేక 1860 ప్రాంతంలో బ్రిటీష్ వారు మోసపూ రితంగా ఆయన్ను పట్టుకున్నారు. నిర్మల్ కూరన్నపేట్ సమీపంలోని మర్రి చెట్టుకు రాంజీ గోండుతో సహా 1,000 మందిని ఒకే సారి ఉరి తీశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ‘వెయ్యి ఉరుల మర్రి’గా నామకరణం చేసి స్మారక స్థూపం ఏర్పాటు చేశారు.
నిమ్మల నాయుడి పేరు మీదుగా..
17వ శతాబ్దంలో నిర్మల్‌ను పాలించిన నిమ్మలనాయుడు(నిర్మల్ నాయుడు) పేరు మీదుగానే నిర్మల్ పట్టణం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. శత్రువుల నుంచి రక్షణ కోసం ఆయన నిర్మించిన కట్టడాలెన్నో ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు నిలువు టద్దంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఓ ఎత్తున గుట్టపై నిర్మించిన ఖిర్మించిన రాజనివాసం ఉండేది.
అక్కగ నుంచి నాలుగు వైపులా ఎవరు దండెత్తివచ్చిన 15 కి.మీ. దూరంలో నుంచే గుర్తించి సైన్యాన్ని అప్రమత్తం చేసేవారు. సున్నం రాయి, బంక మట్టితో ఇక్కడి ఘడీలనే కోటలను నిర్మించారు. ఇందులో బత్తీస్ ఘడ్, శ్యామ్ ఘడ్, సోన్ ఘడ్ కోటలు నిర్మించారు. బత్తీస్ ఘడ్‌లో 32 రాతి దర్వాజలు ఉన్నాయి. వాటిని శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకు న్నారు.
శ్యామ్ ఘడ్, సోన్ ఘడ్, చిల్యాల్ ఘడ్‌లలో సైనిక దళాలు ఉండేవి. ఆయుధాలను దాచేందు కు రహాస్య గృహాలు ఏర్పాటు చేశారు. నీటి కొలనుల్లో సొరంగ మార్గాలు ఇప్పటికీ ఉన్నాయి. నిర్మల్ ప్రాంత రైతులు సుభిక్షంగా ఉండాలని గొలుసుకట్టు చెరువులు కూడా తవ్వించడం గమనార్హం. అలాగే నిర్మల్ పట్టణం చుట్టు ప్రహారీ ఏర్పాటు చేసి పక్కన నీటి కందకాలు తవ్వించారు.
అందులోనుంచి శత్రువులు రాకుండా మొసళ్లను పెంచేవారని చెబుతారు. రెండు చైన్ గేట్‌లు, రాణీల నివాసం కోసం శరత్‌మహాల్ భవనం, రాణివాసం పూల దోట, వెంకటాద్రి పేట్ గుట్ట బురుజులు, అయుధాల కర్మాగారాలు, ఇనుపరాళ్ల గుట్ట ఇప్పటికీ ఉండడం విశేషం.
నిర్మల్ నాయుడు తన పాలనాకాలంలో కుల వృత్తులు, కళలను ప్రోత్సహించారు. నిర్మల్ కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్ అప్పటి నుంచే మొదలై ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. నకాశీ కళాకారులు పునికి చెట్టు కర్రతో చేతి శ్రమతో కొమ్మబొమ్మలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
వారాల పేరుతో వాడలు..
నిర్మల్ పట్టణంలో వారాల పేరు మీదుగా కాలనీలు, వాడలు ఉండడం గమనార్హం. సోమవారానికి సోమవార్ పేట్, మంగళవారానికి మంగళపేట్ , బుధవారానికి బుధవార్ పేట్, బేస్తావారానికి బేస్తావార్ పేట్, శుక్రవారానికి జుమ్మరాత్ పేట్, శనివా రానికి శాస్త్రీ నగర్, ఆదివారానికి రవి నగర్ పేర్లతో వాడలు ఉండడం ప్రత్యేకతను సంతరించకుంది.
కవులు, కళాకారులకు పుట్టినిల్లు..
నిర్మల్ జిల్లాలో ఆదినుంచి కవులు, కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని నర్సాపూర్ మండల కేంద్రానికి చెందిన రాజారాధారెడ్డి కూచిపూడి నాట్యంలో ప్రపంచ ఖ్యాతి గడించారు. ఆదికవి భోయ ధర్మన్న పంతులు పద్యగానకళలను ప్రోత్సహించారు. మడి పత్తి భద్రయ్య ఎన్నో పుస్తకాలను రాసి ప్రముఖ రచయితగా వెలుగొందారు.
వైద్యులు చక్రధరి, దామెర రాములు, డాక్టర్ కృష్ణంరాజు, దేవిదాస్, వెంకట్ , వెంకట్ హన్మంతు, పరమేశ్వర్, పురుషోత్తం, రాజారెడ్డి, దేవురావు ఉండలిక్, జగదీశ్వర్, రవి కిరణ్, వేణు గోపాల్, శివప్రసాద్ తదితర కవులు, రచయితలు ఈ నేల ఔన్నత్యాన్ని రచనల్లో చాటారు. తెలంగాణ రచయితల ఫోరం, నిర్మల్ సాహిత్య అకాడమీ, నిర్మల్ సాంసృతిక సారథి తదితర సంస్థలు సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి.
ఉత్సవాల్లో ఆకట్టుకునే స్టాల్స్..
జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో నిర్మల్ ప్రాంతంలో లభించిన శాసనాలను కూడా ప్రదర్శించబోతున్నారు. మహిళా సంఘాల విజయగాథలను చూపిం చబోతున్నారు. వారికి సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఫొటో ఎగ్జిబిషన్ అలరించనున్నాయి. ప్రభుత్వం పథకాలపై అవగాహన కార్యక్రమాలు ఉండనున్నాయి. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవతో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.
చారిత్రక ప్రదేశాలకు కొదువలేదు..
జిల్లాలో చారిత్రాత్మక ప్రదేశాలు ఎన్నో ఉన్నా యి. దేశంలో రెండు సరస్వతి దేవాలయాలు ఉంటే అందులో ఒకటి నిర్మల్ జిల్లా బాసరలో ఉండడం గొప్ప విషయం. తల్లి హత్య పాప నివారణ దోషం తొలగించుకునేందుకు పరుశు రాముడు ఘోర తపస్సు చేసి శివున్ని ప్రసన్నం చేసుకున్న శ్రీ కదిలి పాపేశ్వర అన్నపూర్ణ ఆలయం దిలువార్‌పూర్ మండలం కదిలి గ్రామంలో ఉంది.
మహిషాసురుడు పాలించిన మహిషాపట్టణం (నేటి భైంసా), కుబేరుడు పాలించిన కుబీర్, బుద్ధుడు ధ్యానం చేసిన బాదకురి... ఇలా ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ఆలయాలు జిల్లాలో కొలువై ఉన్నాయి. బౌద్ధ, జైన, చాళుక్య, కాకతీయ..వంటి ఎందరో శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. 1932లో గోదావరి నదిపై నిర్మల్ నిజమాబాద్ జిల్లాలను వేరు చేస్తూ నిర్మించిన 33 పిల్లర్ల రాతివంతెన ఇప్పటికీ ఆకట్టుకుంటోంది.