calender_icon.png 25 October, 2024 | 7:55 AM

పెద్దదిక్కును కోల్పోయాం..

30-05-2024 12:05:00 AM

నీళ్లు.. నిధులు.. నియామకాల విషయంలో అన్యాయానికి గురవుతున్న తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను  సమర్పించారు. ఎందరో రాష్ట్రం కోసం అమరులైయ్యారు. అమరుల త్యాగఫలంతో స్వరాష్ట్ర కల కలగానే మిగిలిపోకుండా సిద్ధించి పది వసంతాలు పూర్తి అయ్యాయి. కానీ అమరవీరుల ఆకాంక్షలు మాత్రం నెరవేరింది లేదు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరుడు బోయ చెన్నయ్య కుటుంబ సభ్యులను ‘విజయక్రాంతి’ పలకరించింది. తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి, ప్రభుత్వ సహాయం అందక ధీనస్థితిలో ఉన్న  బోయ చెన్నయ్య భార్య రాములమ్మ, బోయ చెన్నయ్య కొడుకు వేణుగోపాల్ తమ కన్నీటిగాథను విజయక్రాంతి మహబూబ్‌నగర్ ప్రతినిధితో  పంచుకున్నారు..

కన్నీళ్ళతో కాలం గడుపుతున్నాం..

మాది మహబూబ్‌నగర్‌లోని బాలానగర్ మండలం గౌతంపూర్ గ్రామం. మాకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. అధికారులు పది లక్షలు ఇచ్చిండ్రు అంటు చాలా మంది అంటున్నారు. నా భర్త ఉండుంటే ఇవన్నీ ఎప్పుడో తెచ్చిపెట్ట్టేటోడు. ఇంటికి పెద్ద దిక్కైన నా భర్త తెలంగాణ కోసం 2011 సంవత్సరంలో నీళ్ళట్యాంక్ ఎక్కి జై తెలంగాణ అంటూ కిందికి దూకి చనిపోయిండు. అప్పటి నుంచి మా కన్నీళ్లు ఆగడం లేదు. తెలంగాణ వచ్చిన తరువాత ఇంకా మా బతుకులు మారుతాయి అను కున్నాం. పది లక్షలు ఇచ్చిండ్రు, అప్పులు కట్టినం. నాకు బీసీ హాస్టల్‌లో వంట మనిషిగా ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి హస్టల్లోనే పనిచేస్తున్నాను. నాకు ఇద్దరూ ఆడ పిల్లలు ఒక కొడుకు. ఇద్దరి ఆడ పిల్లల పెళ్లిలు చేశాను. కొడుకు మా ఊర్లోనే ఏదో ఒక పనిచేసుకుంటున్నాడు.

నేను వనపర్తి జిల్లా పరిధిలోని బీసీ హస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నా ను. నా కొడుకు మా ఊరి దగ్గరే ఉంటున్నాడు.. అక్కడే ఉంటూ ఏదో దొరికిన పని చేస్తున్నాడు. వాడికి వచ్చే జీతం తినడానికే సరిపోతుంది. వర్షాకాలం వచ్చిదంటే మా ఇంట్లోకి నీళ్లు వస్తాయి. అప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది. పిల్లలను చూద్దామంటే కూడా నాకు సమయం ఉండదు. పిల్లలకు దూరంగా హస్టల్‌లో ఉంటూ పనిచేస్తున్నాను. ఏ జిల్లా వాళ్లకు ఆ జిల్లాలో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ నాకు మాత్రం ఇవ్వ లేదు. ఎన్ని సార్లు అడిగిన అధికారులు పట్టించుకోవడం లేదు. అమరుల కుటుంబం మాది అంటే కూడా  పట్టించుకోరు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. మా బతుకులకు అర్థం లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ వనపర్తి జిల్లాలోని హస్టల్‌లో పనిచేస్తున్నాను. పాలమూరు జిల్లాలో ఇస్తే మా ఇంటికి దగ్గర ఉంటుండే. ఇంటికి దగ్గరగా పని చేసుకుంటూ ఎలానో ఒకలా బతికేటోళ్ళం. సర్కారు మా గురుంచి అలోచించాలి.

దిక్కు దిక్కుకయితిమి..

ఇప్పుడు ఉన్నదే ఇద్దరం తల్లి కొడుకులం.. అందరం దిక్కుదిక్కుకై బతుకుతున్నాం. భూమి గింత కూడా లేదు. అప్పటి సర్కారు మాకు మూడు ఎకరాల భూమి, ఉద్యోగం, ఇల్లు ఇస్తమని చెప్పింది. కానీ ఏమి ఇవ్వలేదు. ఉన్న ఒక్క చిన్న గదిలో వర్షం పడితే నీళ్లు లోపలికి వస్తాయి. నా కొడుకు ఆ ఇంటిలోనే ఉంటాడు. అప్పుడప్పుడు పోయి వస్తాను. మా ఊరి లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిండ్రు. ఊరిలో కొంత మందికి, బాలానగర్ వాళ్లకు కూడా ఇచ్చారు. మాకు మాత్రం ఇవ్వలేదు. అడిగితే తరువాత చూద్దామంటున్నారు. ఎవర్ని అడిగిన ఎవరూ పట్టించుకోవడం లేదు. తెలంగాణ వచ్చిన కూడా మాకు న్యాయం జరగలేదు. చాలా చెప్పారు కానీ మాకు చేసింది ఏమి లేదు. ఉన్న ఇంటిని చూసి నా కొడుకుకు పిల్లను ఇస్తా రో ఇవ్వరో తెల్వదు. జర్ర ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం లో మాకు న్యాయం జరిగితే బాగుండేది.

 - బోయ చెన్నయ్య భార్య రాములమ్మ 

మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?

తెలంగాణ వచ్చిన కొత్తలో అందరూ మా ఇంటికి వచ్చి మీ నాన్న తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిండని ఎంతో గొప్పగా అనేటోళ్ళు. నేను అనుకున్న మా నాన్న ప్రాణం తీసుకున్నది ఇంత గొప్పపనికా అని. అప్పుడు ఎంతో మంది వచ్చి మమల్ని పలకరించేటోళ్లు. మీకు ఏమైనా మేమున్నాం అనేటోళ్ళు. మా బాధ ఎంతో ఉంది. మమల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరూ లేరు. అమ్మ దూరంగా హస్టల్‌లో వంట మనిషిగా ఉద్యోగం చేస్తుంది. నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఏదో చిన్న చిన్న పను లు చేసుకుంటున్నాను. అప్పుడు ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పుడు ఎవరు పట్టించు కోవట్లేదు. ఉండడానికి ఇల్లు ఉన్న ఎట్లాగో అట్లా బతికేటోళ్ళం. మాకు సర్కారు న్యాయం చేయాలి. సర్కారు సహయం కోసం ఎదురుచూస్తూ బతుకుతున్నాం. 

  - చెన్నయ్య కుమారుడు వేణుగోపాల్