కింగ్స్‌టౌన్: సంచలనాలకు కేరాఫ్‌గా మారిన టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తృటిలో పరాజయాన్ని తప్పించుకుంది. శనివారం గ్రూప్ పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన నేపాల్ ప్రపంచకప్ నుంచి భారంగా నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (49 బంతుల్లో 43, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 27 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆఖర్లో రాణించడంతో సౌతాఫ్రికా వంద పరుగుల మార్క్ దాటగలిగింది. నేపాల్ బౌలర్లలో కుషాల్ భుర్తేల్ 4 వికెట్లతో సఫారీలను వణికించగా.. దీపేంద్ర సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (49 బంతుల్లో 42, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించగా.. అనిల్ సాహ్ (24 బంతుల్లో 27) జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో షంసీ 4 వికెట్లు పడగొట్టగా.. మార్క్రమ్, నోర్జే చెరొక వికెట్ తీశారు. 115 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నేపాల్ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. అయితే 8వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన షంసీ ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి నేపాల్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత కూడా నేపాల్ ధాటిగానే ఆడి టార్గెట్‌కు చేరువగా వచ్చింది.
18వ ఓవర్‌లో మరోసారి బంతి అందుకున్న షంసీ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్‌లో నేపాల్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా మ్యాచ్ ఉత్కంఠగా మారింది. తీవ్ర ఒత్తిడిలో సఫారీ బౌలర్ బార్ట్‌మన్ నేపాల్ బ్యాటర్లను కట్టడి చేశాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన దశలో గుల్షన్ జా రనౌట్‌గా వెనుదిరగడంతో నేపాల్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. షంసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల నుంచి అద్భుతంగా పుంజుకున్న నేపాల్.. మ్యాచ్‌లో ఓటమి పాలైనా.. తమ పోరాటంతో అభిమానుల మనసులు గెలుచుకుంది.