25 May, 2026 | 4:43 AM

మే 25 నుంచి 30 వరకు మహిళా సంక్షేమ వారోత్సవం: కలెక్టర్

25-05-2026 02:03 AM

సంగారెడ్డి, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 25 నుండి 30 వరకు జిల్లాలో మహిళా సంక్షేమ వారోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

మే 25న అన్ని ఎఎల్‌ఎఫ్లు, టీఎల్‌ఎఫ్లు స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా ఆర్థిక వారోత్సవంపై అవగాహన కల్పించనున్నారు. మే 26 నుండి 30 వరకు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తుల ప్రదర్శనలు, బ్యాంక్ లింకేజీ కార్యక్రమాలు, రుణ మేళాలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన, మార్కెటింగ్ అవకాశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 27న మహిళా వ్యాపారవేత్తలకు  మున్సిపాలిటీలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేవలు అందించనున్నారు.   మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే ఈ వారోత్సవ కార్యక్రమాలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.