ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి...
పటాన్ చెరు (విజయక్రాంతి): మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు బలోపేతం చేయడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా.. బుధవారం జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాలుగు మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రూ.50 లక్షల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల జీవితాల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోలన్ రోజాబాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.