calender_icon.png 16 October, 2024 | 10:50 PM

మహిళలు హక్కుల సాధన కోసం ఉద్యమించాలి

16-10-2024 08:53:49 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఎన్ ఆశలత గారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలకు సింగిరెడ్డి నవీన, బొడిగం వరలక్ష్మి, జాలిగపు శిరీష అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆశాలత  మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు దూసుకుపోతున్న నేటి సమాజంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అమలు కావడం లేదని ఫలితంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అన్ని రంగాలలో మహిళలకు సరైన ప్రాధాన్యతలు ఇవ్వడంలో వివక్షత చెబుతున్నారని, అనేక అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

33 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం దానిని అమలు చేసే దానికోసం కృషి చేయడం లేదని మహిళల హక్కులను కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్లకు కల్పించే విధంగా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు గ్యాస్ లాంటి ధరలు పెంచడం వల్ల మహిళలు కుటుంబాలను పోషించుకోలేక పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నారని అన్నారు. పాలకులు మహిళా సాధికారత కోసం ఎన్ని మాటలు చెప్పినా అవి నీటిమట్టల్లాగానే ఎన్నికల హామీలుగానే ఉంటున్నాయి తప్ప ఏ ఒక్కటి అమలు కావడం లేదని అన్నారు. నేడు దేశంలో మతోన్మాద శక్తులు మహిళలను చిన్నచూపు చూస్తూ వారిని అనేక రకాల అవమానాలకు గురి చేస్తున్నారని వాళ్ళ హక్కులను హరించి వేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో మహిళలకు ప్రతి మహిళకి 2500 రూపాయలు తమ అకౌంట్లో వేస్తామని మహిళలకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని పెన్షన్ పెంచుతామని చాలా మాటలు చెప్పారని అవి ఏవి పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మరలించే విధంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజా పాలన ను గాలికి వదిలేసారని అన్నారు. నాటి స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు జరిగిన అన్ని పోరాటాలలో మహిళల పాత్ర చాలా గొప్పదన్నారు. పాలకులు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని, మహిళా హక్కుల సాధన కోసం బలమైన పోరాటాలను చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభల్లో ఇప్పకాయల శోభ, తాజా మాజీ ఎంపీటీసీ కాముని మంజులత, వరలక్ష్మి, రాజమణి, జ్యోతి, సుజాత,  నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.