07-03-2025 12:28:27 AM
కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, మార్చి 6 (విజయక్రాంతి): మహిళల కోసం ప్రభుత్వం కల్పించిన సమాన హక్కులను, చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో తెలంగాణ గెజిటెడ్ అధి కారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకి సమానమైన హక్కులతో పాటు ప్రత్యేకమైన చట్టాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయ చట్టం వంటి చట్టాల ద్వారా మహిళలు హింసల్ని ఎదుర్కోవడానికి ప్రభు త్వం ఎన్నో శాఖల ద్వారా వారికి సహకారం అందిస్తున్నదన్నారు.
మహిళలు ఏ సందర్భంలోనైనా లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లయితే వారికి 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య, న్యాయ, పోలీస్, కౌన్సిలింగ్, షెల్టర్ వంటి సహాయాల్ని అందించడం జరుగుతుందని వివరించారు. మహిళలకు ప్రభుత్వం ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ బిఎస్.లత మాట్లాడుతూ సీతాదేవి 14 సంవత్సరాలు రాముని వెంట ఒక అడవిలో వనవాసం చేసిందంటే ఎంత ధైర్యవంతురాలో గమనించాలన్నారు. లంక రాజ్యంలో రావణాసురుడు సీతాదేవిని బంధించినా, రాముడు వచ్చి తీసుకెళ్తాడని నమ్మకంతో రాక్షస రాజ్యంలో అంత ధైర్యంగా ఉందని అభివర్ణిస్తూ, ఇప్పటి మహిళలు చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలని మహిళా ఉద్యోగులకు తెలిపారు. స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని ధైర్య సాహసాలకు ప్రతిరూపమని అదనపు కలెక్టర్ లత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటిఓ షఫీయ, డిఏవో సుజాత, జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యవతి, బీసీ వెల్ఫేర్ అధికారి సుజాత, కమిటీ చైర్మన్ రచన ఆయా శాఖ అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.