కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికుల పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి ఎదుట కార్మికులు వినూత్నంగా ఒంటి కాలుపై నిలపడి నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల వేతన బడ్జెట్ విడుదల చేయలేదని దీనితో ఏజెన్సీ కాంట్రాక్టర్లు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
చాలీచాలని వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంచితే కార్మికుల జీవనం సాగేది ఎలా అని ప్రశ్నించారు. ఇంటి అద్దెలు, నెలవారి ఈఎంఐలు, పొదుపు సంఘాల చెల్లింపులు, పిల్లల ఫీజులు కట్టుకోలేక మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరికాదన్నారు.మానవత దృక్పథంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా ప్రతినెల 5 లోపు జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 7 నెలల పెండింగ్ వెతనాల బడ్జెట్ విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిచో ఆందోళనలు ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కార్మికులు మల్లేష్, మురళి, సత్తార్, మమత, తదితరులు పాల్గొన్నారు.