10-03-2025 12:07:52 AM
నాలెడ్జి సిటీలో మహిళా ఉత్పత్తుల ప్రదర్శన
ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో మహిళా ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 9 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్.వి. పాటిల్ ఆలోచన మేరకు, ‘ఎక్స్ ప్లోర్ భద్రాద్రి కొత్తగూడెం‘ కార్యక్రమంలో భాగంగా 2025 మార్చి 9న ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జి సిటీలో ఓ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘రన్ ఫర్ హర్‘ (RUN FOR HER) అనే కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల రన్ నిర్వహించబడింది, ఇందులో సుమారు 1000 మంది మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మహిళలు స్వయంగా తయారుచేసిన కరక్కాయ టీ పౌడర్, తేనే, ఫ్లేవర్ తేనే, విప్పపూలు, విప్పనూనె, మిల్లెట్స్తో తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్స్, గిరి ప్రొడకట్స్ అయిన సబ్బులు, న్యూట్రిమిక్స్ మరియు డ్రైమిక్స్ వంటి వివిధ ఉత్పత్తులు ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ప్రదర్శించబడ్డాయి. వాటి ఆకర్షణీయమైన ప్యాకింగ్ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. ఈ ఉత్పత్తులను ఈవెంట్లో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వైద్యులు, వివిధ రంగాల్లో ఉన్న మహిళలు విశేషంగా కొనుగోలు చేసి ప్రోత్సాహం చూపించారు. జిల్లా కలెక్టర్ జితేశ్.వి. పాటిల్ ఆలోచనకు మహిళా సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగ జ్యోతి (ౄPM), వెంకయ్య (APM) తదితరులు పాల్గొని మహిళల ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించారు