calender_icon.png 2 April, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

27-03-2025 12:22:05 AM

ఖాళీ బిందెలతో నేషనల్ హైవేపై రాస్తారోకో

హుస్నాబాద్, మార్చి 26 : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్దసముద్రాలలో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గత పది రోజులుగా గ్రామంలో మిషన్ భగీరథ నీటితో పాటు గ్రామ పంచాయతీ నల్లా నీళ్లు సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామంలోని మెదక్-హనుమకొండ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి రాస్తారోకో చేశారు.

మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శి గానీ, స్పెషల్ ఆఫీసర్ గానీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని మహిళలు మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ఉన్నా దాని ద్వారానైనా నీళ్లు అందించడంలేదన్నారు. తమ సమస్యను పరిష్కరిం చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు.

సుమారు గంటపాటు రోడ్డుపైనే బైఠా యించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నా వినిపించుకోలేదు.

దీంతో పోలీసులు అప్పుడే ఫోన్ ద్వారా ఎంపీడీవోతో మాట్లాడారు. గ్రామస్తులకు ప్రత్యామ్నాయంగా నీటి సరఫరా చేస్తామని ఎంపీడీవో చెప్పడంతో ఆందోళన విరమించారు.  ఎండకాలంలో మంచినీటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించినా గ్రామాల్లో నీటి సమస్యలు పోవడంలేదు.