calender_icon.png 20 October, 2024 | 7:01 AM

ప్రీప్రైమరీలో బోధనకు మహిళా టీచర్లు!

20-10-2024 02:43:19 AM

  1. కొత్త టీచర్ల కోసం స్పెషల్ రిక్రూట్‌మెంట్ యోచన
  2. నివేదిక రూపకల్పన పనిలో విద్యాకమిషన్
  3. ఆమోదం లభిస్తే వచ్చే వచ్చే నుంచి స్కూళ్లల్లో ప్రీప్రైమరీ విద్య

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ విద్యపై తెలంగాణ విద్యా కమిషన్ కసరత్తు షురూ మొదలుపెట్టింది. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ విద్య ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేసింది.

ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా టీచర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనిపై ఓ నిర్ణయానికి రాగా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించాల్సి ఉంది. నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌పీఈ) అమలులో భాగంగా సర్కార్ బడుల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఈ మూడు తరగతులకు బోధించేందుకు ఇప్పుడున్న ప్రభుత్వ టీచర్లు కాకుండా ప్రత్యేకంగా కొత్త టీచర్లను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధ్యయ నం చేయడమే కాకుండా ఇప్పటికే కొంతమంది నిపు ణులతో చర్చలు జరిపాయి.

రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరే ట్ స్కూళ్లలో ప్రీప్రైమరీ విద్య ఎలా అమలవుతోంది? పలు రాష్ట్రాల్లో ఏ విధానాలను అవలంబిస్తున్నారో అధ్యయనం చేశారు. ప్రీ ప్రైమరీ విద్య అమలుపై నివేదికను రూపొందించే పనిలో విద్యాకమిషన్ నిమగ్నమైంది.

పలు సిఫా ర్సులతో కూడిన నివేదికను రూపొందించిన తర్వాత  ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే సర్కారు బడు ల్లో ప్రీ ప్రైమరీ విద్య పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

మహిళా టీచర్లతో పాఠాలు..

ప్రీ ప్రైమరీ విద్య కోసం మహిళా టీచర్లను నియమించాలన్న నిర్ణయం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలు స్తోంది. ప్రైవేట్‌లోని ప్రీ ప్రైమరీ తరగతుల్లో బోధించేవారిలో దాదాపు 90 శాతం వరకు మహిళా టీచర్లే ఉంటారు. వారైతేనే ఓపికగా చిన్నారులకు విద్యాబుద్ధులు చెబుతారని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యాశాఖలో 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. డీఎస్సీ-2024లో భర్తీ చేసిన 11 వేల పోస్టులను మినహాయిస్తే మరో 14 వేల పోస్టులను భర్తీచేయాల్సి ఉంది.

ఇందుకోసం ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టి కొత్త టీచర్లను రిక్రూట్ చేసి ఈ హామీని నిలబెట్టుకోవచ్చన్న ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు సర్కార్ బడుల్లో ఎన్‌రోల్‌మెంట్ భారీగా తగ్గుతోంది.

తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలోని సర్కారు బడుల్లో 19 లక్షల విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో పాఠశాల విద్యలో ఇప్పటికే ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:10గా ఉంది. అంటే కొత్తగా టీచర్లను సర్కారు బడుల్లో రిక్రూట్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.